calender_icon.png 2 August, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్గవాస్త్రతో శత్రు దేశ డ్రోన్లకు చుక్కలే!

15-05-2025 12:32:47 AM

  1. తక్కువ ఖర్చుతో కౌంటర్ ఎటాక్ డ్రోన్ వ్యవస్థ సిద్ధం
  2. ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో విజయవంతంగా పరీక్షించిన సోలార్ డిఫెన్స్ అండో ఏరోస్పేస్ లిమిటెడ్
  3. 2.5 కి.మీ. దూరం నుంచే శత్రు డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేసే సత్తా భార్గవాస్త్ర సొంతం 

న్యూఢిల్లీ, మే 14: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ మన దేశంపైకి భారీగా డ్రోన్లతో దాడులకు తెగబడగా.. మన దళాలు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాయి. ఇక ముందు ఇలాంటి ముప్పు ఎదురైతే డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేలా భారత్ ఓ సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది.

ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో మంగళవారం భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. రెండు ప్రయోగాల్లో ఒక్కొక్క రాకెట్‌ను పరీక్షించగా.. మరో ప్రయోగంలో రెండు సెకన్లలోపు సాల్వోమోడ్‌లో రెండు రాకెట్లను టెస్ట్ చేశారు. మొత్తం నాలుగు రాకెట్లు నిర్దేశించిన లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయని, భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థ పరీక్షలు విజయవంతమైనట్టు అధికారులు బుధవారం వెల్లడించారు.

భార్గవస్త్ర, డ్రోన్ సమూహాల ముప్పును గణనీయంగా ఎదుర్కొంటుదని స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన భార్గవాస్త్ర 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయగలదు. గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పును కూడా పసిగట్టే సామర్థ్యం ఉంది.

తొలి లేయర్‌లో అన్‌గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి, 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక రెండో లేయర్‌లో గైడెడ్ మైక్రో మిసైల్‌ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.

భార్గవాస్త్ర ప్రత్యేకతలు

* భార్గవాస్త్ర అనేది యాంటీ డ్రోన్ వ్యవస్థ. ఇది వేగంగా వచ్చే డ్రోన్‌లను గుర్తించి నాశనం చేయగలదు

* ఇది 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న డ్రోన్‌లను గుర్తించగలదు. ఇందులో రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్/ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, ఆర్‌ఎఫ్ రిసీవర్ ఉంటాయి. ఇది 2.5 కిలోమీటర్లలోని డ్రోన్‌లను నాశనం చేయగలదు. 

* డ్రోన్‌లను నాశనం చేయకుండా వాటిని నిలిపివేయగల జామింగ్, స్పూఫింగ్ వం టి సౌకర్యాలు కూడా దీనిలో ఉన్నాయి.

* మొదటగా డ్రోన్ సమూహాలను నాశనం చేయడానికి దీన్ని సిద్ధం చేశారు. రెండో దశలో కచ్చితమైన దాడి కోసం ఇప్పటికే విజయవంత పరీక్షలు నిర్వహించారు.

ప్రత్యేకమైన వ్యవస్థ

భార్గవాస్త్రను తయారీదారులు ప్రపంచస్థాయిలోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా అభివర్ణించారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు సూక్ష్మ క్షిపణి వ్యవస్థలపై పనిచేస్తున్నప్పటికీ, తక్కువ ఖర్చుతో డ్రోన్ సమూహాల ను నాశనం చేయగల ఇలాంటి వ్యవస్థ రాలేదన్నారు. భార్గవస్త్ర 64 గైడెడ్ మైక్రో క్షిపణులను ఒకేసారి ప్రయోగించగలదు.

సీ4ఐ (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్) సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ, సింగిల్ డ్రోన్లు లేదా మొత్తం సమూహాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈవో/ఐఆర్ సెన్సార్లు తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ (ఎల్‌ఆర్‌సీఎస్) లక్ష్యాలను కచ్చితంగా గుర్తించేలా చేస్తుంది. భారత సైన్యం త్వరలో దీన్ని తన రక్షణ వ్యవస్థలో చేర్చాలని యోచిస్తోంది.