31-08-2025 12:27:04 AM
హైదరాబాద్, ఆగస్టు 30(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న తరుణంలో శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని ఉన్నత న్యాయస్థానంలో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలని కోరారు. నివేదికపై చర్చించినా మాపై చర్యలు తీసుకోకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే ఈ పిటిషన్‌పై వాదనలు సోమవారం వింటామని హైకోర్టు పేర్కొంది. కాళేశ్వరం కమిషన్ నివేదకను కొట్టివేయాలని గతంలోనూ కేసీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
పీపీటీకి అవకాశం ఇవ్వట్లేదు: హరీశ్‌రావు
కాళేశ్వరంపై తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి భయం ఎందుకని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మాట్లాడు తూ వాస్తవాలు వినేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది కోర్టులు, ప్రజలు అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై పీపీటీకి అవకాశం ఇవ్వట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నట్లే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవా లు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన విమర్శించారు.