28-05-2025 02:26:02 PM
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్(BRS Working President KTR) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదు.. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాల్లోనే నాణ్యత లేదని కేటీఆర్ విమర్శించారు. అశాస్త్రీయ నివేదికలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ఎజెండాతో కూడుకున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీఏ నివేదిక అనడంలో తప్పులేదని కేటీఆర్ చెప్పారు. శాస్త్రీయ వివరాలు లేకుండానే కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తోందని స్పష్టం చేశారు. కాళేశ్వరం తెలంగాణకు జీవధార, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఒక దార్శనికుడు అని కేటీఆర్ సూచించారు.
కేసీఆర్ కి పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను(Kaleshwaram Lift Irrigation Project) పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి క్షమించరాని పాపం చేశారని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయిన రేవంత్ రెడ్డి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామా షూరు చేశారని మండిపడ్డారు.
ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని సూచించారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్-బీజేపీల(Congress-BJP) కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.