calender_icon.png 29 May, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ రాతలు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలి

28-05-2025 02:06:16 PM

చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): మీ రాతలు భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy ) అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో గల సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన " గోల్కొండ కవుల సంచిక"  గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి, గ్రంథ రూపం లోనే సమాధానం ఇచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని  చెప్పారు.  తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి  అని అన్నారు. 

పత్రికా సంపాదకుడుగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన ప్రతాప రెడ్డి(Suravaram Pratapa Reddy) ప్రతిభ, కృషి అనన్యమైనవి అని తెలియజేశారు.  స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి సురవరం ప్రతాపరెడ్డి  పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు, ఉర్దూ ,హిందీ, సంస్కృతం , ఫారసీ, ఆంగ్ల భాషలో నిష్ణాతులన్నారు.  గోల్కొండ పత్రికకు అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ది  చెందారని, నిజాం నిరంకుశ పాలనలో తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 

వనపర్తి శాసనసభ్యులుగా ఎన్నికై పూర్తిగా తన జీవితాన్ని ప్రజా సేవ కోసం అంకితం చేశారని తెలిపారు.  వీరు సాహిత్యానికి చేసిన సేవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి  పేరును పెట్టి వారికి సముచిత స్థానం ఇచ్చామని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,సిజె బెనహార్, అవేజ్ , గంజి ఆంజనేయులు, ఓబిసి సెల్ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తిరుమల వెంకటేష్, రవికిషన్ రెడ్డి, రామచంద్రయ్య, కృష్ణయ్య, సంజీవ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, తూము ఇంద్రసేనారెడ్డి, మల్లు నర్సింహ్మారెడ్డి, ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, ప్రసాద్ ముదిరాజ్, గోపాల్, చర్ల శ్రీనివాసులు, తెలుగు గూడెం ఆంజనేయులు, మురళీధర్ గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.