10-09-2025 12:00:14 AM
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపర్చిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్,బెన్ష లోమ్ తో కలిసి కలెక్టర్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని, ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా కాళోజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ టౌన్..
హనుమకొండ టౌన్ సెప్టెంబరు 9 (విజయ క్రాంతి): తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూలైవాడలో ప్రముఖ కవి కాళోజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల తెలుగు భాషోపాధ్యాయులు పరమేశ్వర్ విద్యార్థులకు తెలంగాణ మాండలీకంలో ప్రహేలిక (క్విజ్) పోటీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ భాషను బ్రతికించుకోవాలని కోరారు. బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాషకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.