10-09-2025 07:31:42 PM
మంత్రి జూపల్లి..
నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆస్ట్రానమీ ల్యాబ్ ను రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) బుధవారం సాయంత్రం సందర్శించారు. ల్యాబ్‌లో విద్యార్థులకు అంతరిక్షంపై అవగాహన కలిగించేలా ఏర్పాటు చేసిన పరికరాలు, నమూనాలను మంత్రి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలతో పరీక్షిస్తూ, వారు చూపిన పరిజ్ఞానాన్ని అభినందించారు.
ఇలాంటి ల్యాబ్‌లు జిల్లాలో విద్యార్థుల శాస్త్రీయ దృష్టి విస్తరించడానికి తోడ్పడతాయని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఖగోళ శాస్త్రం వైపు ఆకర్షితులవుతారని మంత్రి అన్నారు. అనంతరం గ్రామ శివారులోని వరి, పత్తి పంట పొలాలను మంత్రి పరిశీలించారు. ఇటీవలి భారీ వర్షాలకు నష్టం జరిగిన పంటలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.