calender_icon.png 1 July, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల దళపతి రామచందర్

01-07-2025 01:33:55 AM

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఎన్నిక

ఏకైక నామినేషన్.. నేడు అధికారిక ప్రకటన

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : పార్టీ కార్యకర్తగా మొదలై అంచె లంచెలుగా ఎదిగిన నాయకునికే భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం పట్టం కట్టింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావును తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఎంపిక చేసింది.

సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, ఎన్నికల పరిశీలకురాలు, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ ఎన్నికల నిర్వహణ చేపట్టారు. రామచందర్‌రావు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో, ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికను అధికారికంగా వెల్లడించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. నామినేషన్ల కార్యక్రమానికి కేంద్రమంత్రి, ప్రస్తు త రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు మరో కేంద్రమంత్రి బండి సంజయ్, పార్టీ ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నగేశ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధు లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్రమంత్రి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే సోమవారం రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించారని పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. జాతీయ కౌన్సి ల్ సభ్యుల ఎన్నికల నామినేషన్లు కూడా స్వీకరించినట్లు వెల్లడించారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు మన్నె గూడలోని వేద కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, రాష్ర్ట, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని తెలిపారు.

ఆదివారం సాయంత్రం పార్టీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్.. రామచందర్‌రావుకు ఫోన్ చేసి పార్టీలో ఎంతకాలంగా ఆయన సేవలందిస్తున్నదీ వివరాలు అడిగినట్టు తెలిసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ వేయాల్సిందిగా ఈ సందర్భంగా రామచందర్‌రావుకు సూచన చేసినట్లు సమాచారం.

రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంపై సందిగ్ధత వీడింది. మొదటినుంచి పార్టీ కార్యకర్తలుగా ఉన్నవారిని విస్మరించేది లేదని పార్టీ అధినాయకత్వం దీనితో స్పష్టం చేసినట్లు అయ్యింది.