calender_icon.png 1 May, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామనామ సుధారసధారలు చిమ్మిన కవి కంచర్ల గోపన్న

28-04-2025 12:00:00 AM

“శ్రీరమ సీతగాగ, నిజసేవక బృందము వీరవైష్ణవా

చార జనంబుగాగ, విరజానది గౌతమిగా వికుంఠము

న్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ, వసించు చేతనో

ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ! కరుణాపయోనిధీ!” అంటూ కంచర్ల గోపన్న పలికిన ఈ పద్యం ‘దాశరథీ శతకం’లోనిది. ఒకనాటి రోజుల్లో తెలుగునాట వాడవాడల్లో, ఇంటింటిలో వినిపించే శతకాల్లో ‘దాశరథీ శతకం’ ఒకటి.

వీధిబళ్లలో నేర్పించే తొలి పద్యాల్లో విద్యా ర్థుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పద్యాలే ఇవి. అకుంఠిత రామభ క్తితోపాటు సమాజంలోని ఎన్నో విలువలను గురించి, మనిషి సత్ప్రవర్తనను గురించి, రామచంద్రుని ప్రాశస్త్యాన్ని గురించి ప్రతి పద్యంలో చెప్పే ప్రయ త్నం చేసిన కవి కంచర్ల గోపన్న. 

సహజభక్తికి అధికార శక్తి తోడైంది!

గోల్కొండ రాజ్యాన్ని అబుల్ హసన్ తానీషా పాలిస్తున్న 17వ శతాబ్దంలో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న మంత్రి, కౌమాంబ దంపతులకు జన్మించిన గోపన్న, గోల్కొండలో రాజ్యంలో అధికారులైన అక్కన్న, మాదన్న సోదరులకు మేనల్లుడు. కాలాంతరంలో ‘రామదాసు’గా పిలువబడి ఎన్నెన్నో కీర్తనల్లో భద్రాచల రాముణ్ణి కీర్తించిన గోపన్న బాల్యం నుంచే రామభక్తి  సంపన్నుడు.

మేనమామలైన అక్కన్న మాదన్నల కారణంగా భద్రాచలం తహశీల్దారుగా గోపన్న నియమితుడైనాడు. సహజంగా రామభక్తి మిక్కుటంగా కలిగిన గోపన్నకు అధికారం మరింత శక్తిని ఇచ్చింది. అక్కడ రామాలయం నిర్మించాలన్న సంకల్పం కలిగింది. భద్రాచలమన్నా, భద్రాచల రాముడన్నా ఎక్కడ లేని ఆనందాన్ని పొందే గోపన్న ఈ పద్యం లో.. భద్రాచలమే వైకుంఠం,

రామచంద్రుడే శ్రీమన్నారాయణుడు, సీతాదేవే సాక్షత్తూ లక్ష్మీదేవి, ఇక్కడ ప్రవహించే గోదావరే వైకుంఠంలోని విరజానది, మా కష్టాలన్నీ దూరం చేయగల వానివే గనుక.. స్వామిని కీర్తిస్తూ చెప్పిన ఈ పద్యాల్లోని మకుటం ‘దాశరథీ! కరుణాపయోనిధీ’ అన్న దానితో ఆ స్వామి కరుణా సముద్రుడన్న స్తుతితో గోపన్న తన భక్తిని ప్రకటించుకున్నాడు. 

శతకానికే కావ్య లక్షణాలు

కీర్తనలకన్నా తొలుత రచించిన ఈ ‘దాశరథీ శతకం’లో కొన్నికొన్ని కావ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. విస్తృతంగా కావ్యాధ్యయనం చేసిన గోపన్న రచనలో అవి ప్రతిబింబించడం సహజమే. ఈ శతకంలోని మొదిటి చివరి పద్యా ల్లో గోపన్న (రామదాసు) జీవితం ధ్వనిస్తుంది. “కార్యసాకర్యమెలర్ప నొక్కశత కం బొనగూర్చి రచింతు”నన్న 6వ పద్యంలో ‘కార్యసాకర్యం’ అన్నమాట లో ఆయన నిర్మించబోయే భద్రాచల రామచంద్రుని ఆలయ నిర్మాణ విష యం ధ్వనించినట్లుంది. సాధారణంగా మహాకవుల మాటలు భవిష్యత్తును ధ్వనింపజేయడం సర్వసాధారణమే.

అదే విధంగా చివరి పద్యాల్లో అంటే ఆశ్వాసాంత పద్యాల్లో వలె తన వ్యక్తిగత వివరాలు చెప్పుకున్నాడు గోపన్న. 102 వ పద్యంలో “పట్టితి భట్టరార్య గురుపాదము లిమ్మెయి నూర్ధ పుండ్రముల్ వెట్టితి” అన్న పాదాన్నిబట్టి గోపన్న వైష్ణ వం స్వీకరించినట్లు తెలుస్తున్నది. అందులోనే “మంత్రరాజమొడి బెట్టితి”నన్న వ్యాక్యాన్నిబట్టి గురువు దగ్గర తార క మంత్రోపదేశం పొందిన విషయం అర్థమవుతున్నది.

అయితే, ఈ తారక మంత్రం తీసుకున్నది కబీర్‌దాసు వద్ద అనే ఒక ఐతిహ్యం లోకంలో ప్రచారం లో ఉంది. దానికేమీ గ్రంథ సాక్ష్యాలు లేవు. రామదాసుగా కీర్తనలు రచించిన తదనంతర కాలంలో కూడా “తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా!” అంటూ తాను తరిం చడానికి స్వయంగా కోరి తారక మం త్రోపదేశం పొంది ఉండొచ్చు. ఈ శతకంలోని చివరి పద్యం(130)లో

“అల్లన లింగమంత్రి సుతడద్రిజ గోత్రజుడాదిశాఖ కం

చర్ల కులోద్భవుండన ప్రసిద్ధుడనై భవదంకి తంబుగా

నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్, జగ

ద్వల్లభ! నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ!”

అంటూ ఆశ్వాసాంత సదృశమైన ఈ పద్యాన్నిబట్టి గోపన్న కంచర్ల వంశజుడని, లింగన మంత్రి సుతుడని, ప్రథమ శాఖ వాడని, ఎల్లకవులు ప్రశంసించే విధంగా తన శతకాన్ని రచించి భద్రాచల రామచంద్రునికి అంకితం చేశాడని స్పష్టమవుతున్నది.

సాధారణంగా కావ్య ప్రారంభంలో కవులు తమ స్వీయ వృత్తాంతాన్ని చెప్పుకుంటారు. కానీ, గోపన్న ఈ విషయాల్ని చివర్లో చెప్పుకున్నాడు. సాధారణంగా ఆశ్వాసాంతంలో గద్యం రచించే సంప్రదాయం ఉంది. కానీ, రాయల వారు ‘ఆముక్తమాల్యద’ లో పద్యం రాసినట్టుగా ఈయన కూడా పద్యమే రాశాడు.

సమాజానికి మార్గనిర్దేశనం

కంచర్ల గోపన్న రచించి ‘దాశరథీ శత కం’ భక్తి ప్రధానమైందే అయినా, “ఈ సమాజం ఎట్లా ఉండాలి, యోగ్యుడైన వ్యక్తుల సమూహంగా సమాజం ఉం డటం వల్ల అది లోకోపకారం అవుతుందన్న” భావన కలిగిన గోపన్న యోగ్యు డైన వ్యక్తి ఎట్లాంటి వాడో స్పష్ట పరుస్తూ

“బొంకని వాడె యోగ్యుడని, బృందము లెత్తిన చోట జివ్వకున్

జంకని వాడె జోదు, రబసంబున నర్ధి కరంబు సాచినన్ 

గొంకని వాడె దాత, మిముగొల్చి భజించిన వాడెపో నిరా

తంక మనస్కుడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ!” 

అని అన్నాడు. దీనినిబట్టి అసత్యమాడని వాడు, శత్రువులు దండెత్తినప్పుడు ఏ మాత్రం జంకని వాడు, చేయి చాచిన వానికి లోభత్వం చూపక దానం చేసేవాడు, నిరంతరం నిను సేవించే వాడే అసలైన యోగ్యుడని స్పష్టమైన భావం తో చెప్పిన ఈ పద్యంలో

మనిషన్న వాడికి ఉండాల్సిన సల్లక్షణాలను వివరించిన తీరు గోపన్న అంతరంగాన్ని తెలుపుతుంది.

పద్యధార పరమ రమణీయం

ఛందస్సులో పద్య శిల్పానికే ప్రాధ్యా న్యం ఎక్కువ. ధారాశుద్ధికి, పద్యశిల్పానికి అవినాభావ సంబంధం ఉంది. ఒక కవి ఎన్నుకునే ఛందస్సునుబట్టి పద్యధార పరమ రమణీయమై అలరారు తుంది. ఒక్కో కవికి ఒక్కో ఛందో రూపంపై అధికారం ఉంటుంది. ఆ ఛందంతో తాను రచన చేస్తే అది గొప్ప ధారాశుద్ధి గల రచనగా వాసికెక్కుతుంది. ఈ శతకంలో కవి చంపకోత్పల ఛందోరూపాన్ని ఎన్నుకున్నాడు.

ఆ ఛందో రూపంపై గోపన్నకెంత అధికారముందో, ఆ శతకంలోని పద్యాలే ప్రమాణాలుగా నిలుస్తున్నాయి. పైగా అకుంఠితమైన భక్తి భావనతో తన ఇష్టదైవాన్ని కవి చంపకోత్పల పద్య ప్రసూనాలతో అచ్చించినట్లుంది. చక్కని ధారాశుద్ధితో, పలు శబ్దార్థాలంకారాలతో రచించిన ఈ శతకంలోని అనేక పద్యాలు గోపన్న కవితా ప్రాభవానికి సాక్ష్యాలుగా నిలిచాయి.

“రంగ దరాతిభంగ, ఖగరాజ తురంగ, విపత్పరో

త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ, దయాంతరంగ, స

త్సంగ ధరాత్మజా హృదయసారస భృంగ, నిశాచరాబ్జ మా

తంగ, శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!” 

అన్న పద్యం గొప్ప ధారాశుధ్దితో, శబ్దాలంకార యుక్తంగా, పరమ సుందరంగా రామచంద్రుని ప్రశస్తిని చాటుతు న్నది. శుభాంగుడైన ఆ శ్రీరామచంద్రు డు శత్రుభంజకుడు, గరుడారూఢుడు, ఆపద్రక్షకుడు, హృదయాహ్లాద కారకు డు, కరుణా హృదయుడు, సీతామాత హృదయమనే కమలంలో సంచరించే భృంగము వంటివాడన్న ఈ పద్యం సామాన్య విషయాలనే ఆలంకారిక శోభను గూర్చి రచించిన కారణంగా ఇది గొప్ప పద్యమై శోభించింది.

ఈ శతకంలోని “ఎంతటి పుణ్యమో శబరి యెంగిలి గొంటివి”, “భండన భీముడార్త జనబాంధవుడు”, “శ్రీరఘురామ చారు తులసీదళదామ” మొదలైన పద్యాలు నేటికీ తెలుగు సాహితీప్రియు ల నాలుకలపై నృత్యం చేయడానికి ప్రధాన కారణం భక్తియే అయినా, పద్య నిర్మాణ ప్రతిభ, భావౌన్నత్యం, కవిలోని నిష్కల్మష హృదయం గోపన్న పద్యాల్లో నిబద్ధితమై ఉండటమే అన్నది కాదనరాని సత్యం. 

తెలుగునాట రామభక్తి సుధారసం

గోప్పన్న జీవిత కథ పలు మలుపు లు తిరిగిన విషయం తెలుగువారికి అం దరికీ తెలిసిందే. ఆలయ నిర్మాణం, చెఱసాల జీవితం, కష్టాలు వంటి అనేక సం దర్భాల్లో, అప్పటికే రామదాసుగా మారిన గోపన్న కీర్తనలు కూడా రచించాడు.అవి కూడా 103 కావడం యాదృ చ్ఛికం.

అప్పటికే ఆయన మనసు నిం డా రామచంద్రుడే కావడం వల్ల “అంతా రామమయం, ఈ జగమంతా రామమయం” అంటూ స్వామిని తాదాత్మ్యంలో కీర్తించిన రామదాసు కీర్తన విస్తృత ప్రచారం పొంది తెలుగునాట రామభక్తి సుధారసాన్ని ప్రవహింప జేసింది. దాదాపుగా రామదాసు కీర్తనలన్నీ తెలుగు వాళ్ల ఎదల లోతుల్లో స్థానం సంపాదించుకున్న విలువైన ఆణిముత్యాలే. 

“శ్రీరామ నీ నామమెంతో రుచిరా! ఓ రామ! నీ నామమెంతో రుచిరా!”, “అదిగో భద్రాద్రి”, “సీతారామ స్వామీ నే జేసిన నేరం బేమీ!” వంటి ఎన్నో ప్రసిద్ధ కీర్తనలు నిత్యం తెలుగునాట సంగీత విద్వాంసుల గానాల్లో చోటు చేసుకుంటూ రామదాసు హృదయంలోని ఆర్తిని లోకానికి తెలుపుతూ రస ప్లావితంగా అలరిస్తున్నాయి. వాటి సార్వకాలిక లక్షణం వాటిలోని భక్తిలో ఉన్నా, కవి హృదయ వేదన భగవంతునిపై వున్న ఆర్తికూడా ప్రధానమేనని సాహితీవేత్తల భావన. అరుదైన లాటానుప్రాసాది ప్రయోగాలతో తన రచనల ను శోభావంతం చేసిన రామదాసు

“జయజానకీ రమణ జయ విభీషణశరణ

జయసరోరుహ చరణ జయదీన తరణా!” అంటూ సంస్కృతంలో రచించిన కీర్తనలతో కూడా అలరించిన ప్రతిభామూర్తి రచించిన ‘దాశరథీ శతకం’, కీర్తనా సాహిత్యం ఆయన కీర్తిని చిరస్థాయిగా నిలిపాయి. అందుకే, తదనంతర కాల వాగ్గేయకారులైన ‘తూము నరసింహదాసు’ వంటి వారిపై ఆయన సాహిత్య ప్రభావం మెండుగా ఉండి ‘రామదాసు చరిత్రము’ను రచించే విధంగా స్ఫూర్తిని ఇచ్చాయి. 

నిత్యపారాయణ పద్యాలు

తెలుగు భాషా ప్రేమికులకు, తెలుగు పద్యప్రియులకు అత్యంత ప్రతిపాత్రమైన ‘మకుటం’ కలిగి ఉన్న ఈ (దాశరథీ) శతకం విస్తృత ప్రచారం పొందింది. 103 పద్యాలు కలిగిన ఈ శతకం ఒక తరం నిత్యపారాయణంగా అధ్యయనం చేశారు.

ప్రతి వ్యక్తికీ కంఠోపాఠంగా వచ్చే శతకాల్లో ఇదొకటి. తరువాతి కాలంలో ఆయన ‘రామదాసు’గా మారి శ్రీరామచంద్రుని కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించా డు. వాటిలో నేటికీ మనకు దాదాపు 130 కీర్తనల వరకు అందుబాటులో ఉన్నాయి. నేటికీ సంగీత సభల్లో అన్నమాచార్యుల కీర్తనలతోపాటు రామదాసు కీర్తనలు గానం చేస్తూ శ్రోతలను అలరిస్తున్నారు సంగీత విద్వన్మణులు.