05-11-2025 07:10:22 PM
సామూహిక సత్యనారాయణ వ్రతాలు..
తులసి మొక్కలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం, సంకష్టహర గణపతి ఆలయం, శ్రీరామ్నగర్ కాలనీ భక్త ఆంజనేయ ఆలయం, సాయిబాబా ఆలయం, రామేశ్వర్ పల్లి శివారులోని సద్గురు సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. గాంధీనగర్ కాలనీలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు.
ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయమే తలంటూ స్నానాలు ఆచరించిన మహిళలు ఇండ్లలోని తులసి మొక్కలకు ఆలయాల వద్ద గల తులసి మొక్కలకు, ప్రత్యేక పూజలు నిర్వహించారు, దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భిక్కనూరు సిద్దరామేశ్వరా లయం ఆలయం, చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయం, రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం, మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఈశ్వర ఆలయం, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని శివకేశవ ఆలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు,ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.