05-11-2025 06:40:29 PM
ఏడుపాయల్లో కార్తీక శోభ..
వైభవంగా లక్ష దీపారాధన
రమణీయంగా సాగిన వనదుర్గమ్మ పల్లకి సేవ
వనదుర్గామాత సన్నిధిలో పోటెత్తిన భక్తజనం
పాపన్నపేట (విజయక్రాంతి): ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆధ్యాత్మిక వాతావరణం.. మంజీరా "ఏడు" పాయలుగా చీలి ప్రవహించే ప్రాంతం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. సాయంత్రం అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి వేడుకున్నారు. లక్ష దీపారాధనతో మంజీరా పరిసరాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. "పండు వెన్నెల్లో.. ప్రమిదల కాంతుల్లో.. ఏడుపాయల క్షేత్రం విరాజిల్లింది". ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పసుపు కుంకుమలు, సౌభాగ్యాలను కాపాడు తల్లీ అంటూ వనదుర్గమ్మకు వేడుకొని మంజీరా ఒడ్డున ప్రమిదలు వెలిగించారు.
వనదుర్గమ్మ ప్రధాన ఆలయం ముందు మంజీరా ప్రవాహం ఉండడంతో రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్దే భక్తులు పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ జ్యోతి వెలిగించి లక్షదీపారాధన కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఆడపడుచులు రాజగోపురం వద్ద, నదీ పాయల ఒడ్డున ప్రమిదలు వెలిగించారు. మరి కొందరు మహిళలు ప్రమిదలను మంజీరా లో వదిలి వివిధ రకాల మొక్కులను మొక్కుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పూజల అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచే పల్లకిని సుందరంగా అలంకరించిన అనంతరం వనదుర్గా మాత ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పల్లకి సేవ కార్యక్రమాన్ని రమనీయంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, అర్చకులు, ఆయా పార్టీల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.