05-11-2025 08:19:14 PM
వరంగల్ (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమైందనీ, అందుకు చింతించిన వరంగల్ ప్రాంతానికి చెందిన పుష్పిత లయ అనే ట్రాన్స్ జెండర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎంపీకి చీరలు, గాజులు, పసుపు, కుంకుమను పంపించారు. కాంగ్రెస్ పరిపాలనకు ఇది నిదర్శనం అని భావించి తాను ఈ విధంగా పంపించినట్లు పేర్కొన్నారు. అనంతరం పుష్పిత లయ మాట్లాడుతూ ఖమ్మం బ్రిడ్జి దగ్గర కబ్జాకు గురైన స్థలం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య హస్తం ఉందని, వరంగల్ నగరంలో కబ్జాలు పెరిగిపోతున్న, కమీషన్లు తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఒక ట్రాన్స్ జెండర్ గా పుష్పిత లయ బయటకి వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మగవాళ్ళైన ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పరిపాలన చేతకావడం లేదంటూ ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ అగ్రహ వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరం మొత్తం వరదల్లో మునిగిపోయిందని ఇందుకు వారి నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, హంటర్ రోడ్ బొంది వాగు ఏరియా జలమయం అయిందని, ప్రతి సంవత్సరం వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. పాలన చేతకాకుంటే దిగిపోండి అంటూ ఒక్కొక్క స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి ఎద్దేవా చేశారు.