05-11-2025 06:37:00 PM
అశ్వాపురం (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం అశ్వాపురం మండలంలోని చింతిర్యాల గ్రామ గోదావరి నది తీరాన ఉన్న పురాతన శివాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేసి భక్తిభావంతో నిండిపోయారు. మహిళలు ప్రత్యేకంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో దీపాలు వెలిగించి, వత్తులతో కూడిన దీపాలను గోదావరి నదిలో సమర్పించారు.
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపం వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల రాకపోకలతో ఆలయం పరిసరాలు కిక్కిరిసిపోయిన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. గోదావరి తీరం, ఆలయానికి వెళ్లే మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.