13-11-2025 08:15:19 PM
విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం..
అభినందించిన కలెక్టర్ ప్రావీణ్య..
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు సంగారెడ్డి మండలంలోని మంజీరా పర్యాటక కేంద్రంలో నిర్వహించిన ఒక రోజు అడ్వెంచర్ హంట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి సోయగాల మధ్య విద్యార్థినులు గుడారాలు వేసుకుని ఒక రోజు బస చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య స్వయంగా అడ్వెంచర్ క్యాంప్‌ను సందర్శించి విద్యార్థినులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం, బృందస్ఫూర్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. ఈ తరహా అనుభవాలు మీ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి అని విద్యార్థినులకు సూచించారు. నేటి సమాజంలో ఆడబిడ్డలు అంకితభావంతో ముందుకు సాగి, విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి ప్రతి రంగంలో ప్రతిభను నిరూపిస్తున్నారని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి లేదా ఉద్యోగాల ద్వారా ఆర్థికంగా ఎదగడం దేశ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని తెలిపారు. ప్రకృతి వాతావరణంలో నిర్వహించిన ఈ అడ్వెంచర్ హంట్ కార్యక్రమం విద్యార్థినుల్లో ఉత్సాహం, మానసిక ప్రశాంతత, సృజనాత్మకతను పెంచిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, ఏంఈఓ శంకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.