13-11-2025 08:42:44 PM
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్..
మెదక్ (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. గురువారం జిల్లా పరిధిలోని కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందో లేదో స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కింద ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని, తేమ శాతం నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతులు తమ ధాన్యాన్ని ఎలాంటి భయాందోళన లేకుండా కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఆయన కోరారు.అలాగే ధాన్యం తూకాలు సక్రమంగా జరుగుతున్నాయా, గోదాముల్లో నిల్వ సదుపాయాలు ఉన్నాయా, గన్ని బ్యాగ్ లు సమృద్ధిగా ఉన్నాయా వంటి అంశాలను ఆయన పరిశీలించారు. అధికారులు రైతులకు సకాలంలో చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వ్యవసాయ, సివిల్ సప్లైస్, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.