13-11-2025 09:01:49 PM
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా కొత్తగా నియమితులైన కమిషనర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ టిఎస్విఎన్ త్రిలేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు, అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలొ పీర్జాదిగూడ మినీ ట్యాంక్ బండ్, సీతాకోక చిలుకల పార్క్, నగరపాలక సంస్థలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అనంతరం సమీకృత వ్యర్ధాల నిర్వహణ పార్కులో తడి పొడి చెత్త తో ప్రాసెసింగ్ చేసే యంత్రాలను పరిశీలించారు.
బ్రికెట్స్ తయారీ, కంపోస్టు తయారీ మరియు పొడి చెత్తతో పునఃచక్రియం జరిగే విధానంపై ఆరా తీశారు. FSTP పనితీరును, అక్కడ జరిగే ప్రాసెసింగ్ విధానంను పరిశీలించినట్లు తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో జరిగిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం తమకెంతో సంతృప్తినిచ్చినట్లు పలువురు కమిషనర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఘన వ్యర్ధాల నిర్వహణ నిపుణులు వెంకటేశం, ITC నుండి ఉమాకాంత్, సుధా, నగరపాలక సంస్థ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శోభా శంకర్, డి ఈ సాయినాథ్ గౌడ్, మేనేజర్ క్రాంతి కుమార్, ఆర్వో కిషోర్ కుమార్, టి పి ఎస్ ప్రశాంతి, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జే ఎ ఓ సుమలత గార్లతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.