28-07-2024 03:39:20 PM
హైదరాబాద్: నీటిపారుదల శాఖపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ అనాలోచిత మాటలు మాట్లాడారని, కేటీఆర్ చేసిన అవగాహన రాహిత, బాధ్యత లేని మాటల్ని నేను ఖండిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేటీఆర్ జోసెఫ్ గోబెల్ రామారావు అని పెట్టుకుంటే మంచిదని వ్యంగ్యంగా చెప్పారు. జోసెఫ్ గోబెల్ ను మించిపోయిన కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే లోపాలు తలెత్తున్నాయని, రైతాంగానికి కేసీఆర్ కుటుంబసభ్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మంత్రులపై నిందారోపణలు సహేతుకం కాదని, కాళేశ్వరం నీళ్లు రాకపోతే దానికి కేసీఆర్ కుటుంబ సభ్యులే కారణమవుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.