21 August, 2026 | 5:03 AM

106వ వసంతంలో కీరాంబి అవివేలు

21-08-2026 01:35 AM

ముషీరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): విద్యానగర్ మజీద్లైన్లో నివాసం ఉంటున్న శతాధిక వృద్ధురాలు కీరాంబి అవివేలు 106వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాదపూజ చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసిన కీర్తిశేషులు కీరాంబి కృష్ణమాచార్యులు భార్య అయిన అవివేలుకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ప్రస్తుతం పిల్లలు, కోడళ్లు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 1921 ఆగస్టు 20న జన్మించిన కీరాంబి అవివేలు,106 ఏళ్ల వయస్సులోనూ చేతికర్ర సహాయంతో నడుస్తూ, చిన్నతనంలో నేర్చుకున్న రామాయణం, సంస్కృతం, తెలుగు పాటలను ఇప్పటికీ పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ప్రకారం ఆమె జ్ఞాపకశక్తి కూడా చురుకుగానే ఉంది.

ఈ సందర్భంగా కుమార్తె రంగనాయకి మనవడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 106 ఏళ్ల వయస్సులోనూ ఆమె స్వయంగా పనులు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబంలో మొత్తం 46 మంది ఉన్నారని తెలిపారు. జన్మదినం సందర్భంగా ఆమె పేరుతో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.