25-10-2025 01:04:17 AM
తనిఖీ చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్
మహబూబాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల అస్తవ్యస్తంగా మారిందని, నిర్వాహకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన మెనూ పాటించడం లేదని, భోజనం వసతి సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి ఎస్ వో ను వివరణ అడగగా పొంతన లేని సమాధానం ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్ పరిశీలించగా కుళ్ళిన కూరగాయలు కనిపించాయి, అలాగే మరుగుదొడ్లు మరమ్మతులు చేయకపోవడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యాలయం, హాస్టల్ నిర్వహణ ఇంత అధ్వానంగా ఉందని, మీ ఇంట్లో ఇలాగే ఉంటుందా అంటూ ప్రశ్నించారు.
స్టాక్ రిజిస్టర్ లేదని ప్రశ్నించగా ఆడిట్కు పంపించామని చెప్పడంతో, తాను తనిఖీకి వస్తున్నట్లు తెలిసికూడా రికార్డులు అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థినులకు సరైన వసతి లేదని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, విద్యాబోధన తీరు కూడా సరిగా లేదని ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి పాల్గొన్నారు.