తలసేమియా చిన్నారుల కోసం కదిలిన ‘ఖమ్మం’ మానవత్వం
- మాతృదినోత్సవం వేళ
- ప్రాణదాతలుగా మారిన 50 మంది నడక సాధకులు
ఖమ్మం, మే 10(విజయ క్రాంతి): అమ్మ అంటే ప్రాణం పోసేది... ప్రాణం ఇచ్చేది.. తొమ్మిది నెలలు రక్తాన్నే పాలగా మార్చి బిడ్డకు జన్మనిచ్చే ఆ తల్లి ప్రేమను స్మరించుకుంటూ, నిరుపేద తలసేమియా చిన్నారుల పాలిట తాము కూడా ’అమ్మ’లమే అని నిరూపించారు ఖమ్మం నగర వాకర్స్. అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించు కుని ఆదివారం ఉదయం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లోని నడక సాధకుల కమిటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప మానవీయ యజ్ఞం జరిగింది.
కేవలం నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, మాతృమూర్తుల త్యాగానికి చిహ్నంగా, రక్తం కరువై కొట్టుమిట్టాడుతున్న నిరుపేద చిన్నారులకు తమ రక్తాన్ని అందించి ప్రాణదానం చేయాలన్న సంకల్పంతో 50 మంది సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని పంపారు. రాకం శ్యామ్ బాబు మాట్లాడుతూ... అమ్మ గర్భంలో ప్రాణం పోస్తుంది& రక్తదాతలు మరోసారి ఆ ప్రాణాన్ని నిలబెడతారు అని భావోద్వేగంగా అన్నారు.
ఒక యూనిట్ రక్తం& ఒక చిన్నారి జీవితానికి కొత్త ఊపిరిని అందించిన వారవుతున్నారన్నారు. తలసేమియా చిన్నారులకు ప్రతి నెలా రక్తం అవసరం అవుతుందని, అలాంటి పిల్లల కోసం ముందుకు వచ్చి రక్తదానం చేయడం నిజమైన మానవసేవ అని పేర్కొన్నారు. రక్తదానం చేయడం ద్వారా అనేక మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, యువత ఎక్కువగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంకల్ప సంస్థ సభ్యులు రవి, డాక్టర్ నారాయణమూర్తి, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రాంబాబు పాల్గొని రక్తదాతలను అభినందించారు. అలాగే వాకర్స్ కమిటీ సభ్యులు రామనాథం, రాకం శ్యామ్బాబు, విజయ్, వెంకట్, మురళీ, నరసింహారావు, రామశేఖరం, గోవర్ధన్, జర్నలిస్ట్ కొరకొప్పుల రాంబాబు లు సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ సభ్యులు కత్తి నెహ్రూ, విడిఐ జయరాజ్, డాక్టర్ జాఫర్, గిరి, సైదారావు రక్తదాతలకు పండ్లు పంపిణీ చేసి అభినందనలు తెలిపారు.






