16-11-2025 07:27:59 PM
కోటయ్య గూడెం మాదన్న చెరువును పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు (విజయక్రాంతి): కురంపల్లి వద్ద ఎస్ఎల్బీసీ కెనాల్ నుండి లిఫ్ట్ ద్వారా మాదన్న చెరువుని నింపాలని కోటయ్య గూడెం గ్రామస్తులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Raj Gopal Reddy) కలిసి విన్నవించారు. ఆదివారం కోటయ్య గూడెంలోని మాదన్న చెరువును స్థానిక నాయకులతో కలిసి ఆయన చెరువు కట్టను పరిశీలించారు. ఎమ్మార్పీ నుండి ఉదయ సముద్రం వరకు వచ్చే ఎస్ ఎల్ బి సి కెనాల్ పై కురంపల్లి వద్ద మోటార్ ని ఏర్పాటు చేసి నీటిని లిఫ్టు చేసినట్లయితే మాదన్న చెరువును నింపవచ్చని, ఈ చెరువు నిండితే ఉడతల పల్లి చెరువుతో పాటు కస్తాల గ్రామానికి చెందిన భూములు మొత్తం సస్యశ్యామలగా మారుతాయి అని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి వివరించారు.
గతంలో జి ఎడవెల్లి గ్రామం నుండి చండూరు పట్టణానికి త్రాగునీటిని అందించడానికి ఏర్పాటుచేసిన పైపులైను వృధాగా ఉన్నదని కురంపల్లి వద్ద ఒక మోటార్ను ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్ కి కనెక్షన్ చేసినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో మాదన్న గూడెం చెరువును నింపే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యేకు వివరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా మాదన్న చెరువు పై దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొరిమి ఓంకారం, గంట సత్యం, మార్కెట్ డైరెక్టర్ బుతరాజు ఆంజనేయులు, మేకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.