calender_icon.png 16 November, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతం అయిన రన్ ఫర్ బీసీ సోషల్ జస్టిస్

16-11-2025 08:19:09 PM

మందమర్రి (విజయక్రాంతి): బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం పట్టణంలో విజయవంతమైంది. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రన్ ఫర్ జస్టిస్(పరుగు) ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ కూడలి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ మాట్లాడారు. బీసీలు తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం న్యాయపోరాటం రాజకీయ పోరాటం చేయాలని అన్నారు.

బీసీ ఉద్యమాన్ని అణగధోక్కాలని, మన స్వరాన్ని అణిచి వేయడానికి  బీసీ వ్యతిరేకుల కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదిరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వెంటనే  బీసీ బిల్ ను పార్లమెంట్లో చర్చ పెట్టడంతో పాటు బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేసి 9వ, షెడ్యూల్లో చేర్చాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అష్టాంగ ఆందోళనలు కార్యక్రమాలలో బీసీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి నేరేళ్ల వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల సతీష్ బాబు, ఉపాధ్యక్షులు దేవరపల్లి ప్రభాకర్, ఏదుల పురం రాజు, ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్ల సారంగపాణి, మడ్డి వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జమాల్పూర్ నర్సోజి, మునిశెట్టి సత్యనారాయణ, పొలు సంపత్, మేడ గోని శంకర్, పోలు కుమార్, రాజలింగు, చింతల రమేష్, సిహెచ్. మహేందర్, మేడి రాజు, పట్టణ రజక సంఘం అధ్యక్షుడు రామ్ చందర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మోహన్ లు పాల్గొన్నారు.