16-11-2025 08:25:33 PM
సిద్దిపేట (విజయక్రాంతి): ఖమ్మంలోని ఎన్ ఎస్ సి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని చంద్రిక రాసిన 'కదా చంద్రిక' బాలల కథల పుస్తకానికి శ్రీవాణి సాహిత్య పరిషత్తు పెందోట బాలసాహిత్య పీఠం సిద్దిపేట వారు పురస్కారం అందించారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన బాల సాహిత్య సమ్మేళనంలో పెందోట సాహిత్య పీఠం వారు చంద్రికకి అవార్డుతో పాటు నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు. తెలంగాణలో విస్తృతంగా బాల సాహిత్యం వెలువడుతున్న సందర్భంలో చంద్రిక కథల పుస్తకంకి పురస్కారం రావడం ఆనంద దాయకమని బాల సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమ నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రిక వాస్తవానికి దగ్గరగా, చేయి తిరిగిన పెద్దలు రాసినట్లుగానే కథలు అద్భుతంగా రాసిందని కొనియాడారు. ముఖ్య అతిథి గరిపల్లి అశోక్, వాసర వేణి పరశురాములు మాట్లాడుతూ చిన్నారి చంద్రిక రాసిన కథలు చాలా అద్భుతంగా ఉన్నాయని కొని యాడారు. భవిష్యత్తులో మరిన్ని కథలు రాసి సాహితి చరిత్రలో చంద్రిక తన పేరును లిఖించుకోవాలని ఆకాంక్షించారు. కథలు రాయడానికి ఎంతగానో ప్రోత్సహించిన చంద్రిక గురువు కోండ్రు బ్రహ్మంని ప్రత్యేకంగా అభినందించారు. చంద్రికకు పురస్కారం రావడం ఖమ్మం జిల్లాకు ఎంతో గర్వకారణమని ఖమ్మం జిల్లా బాలసాహితీవేత్తలు, సాహిత్య ప్రియులు పాఠశాల ఉపాధ్యాయులు కొని ఆడారు. ప్రధానోపాధ్యాయులు దుర్గా భవాని చంద్రికను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాల సాహిత్య వేదిక కన్వీనర్, తెలుగు ఉపాధ్యాయులు కోండ్రు బ్రహ్మం, రాధిక, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .