calender_icon.png 22 October, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

22-10-2025 08:27:52 PM

అనుమతి లేకుండా హాజరు కాని అధికారులపై సస్పెన్షన్ వేటు..

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు..

చిట్యాల (విజయక్రాంతి): అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చ‌రించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ను ఆయ‌న ఆకస్మికంగా తనిఖీ చేసి, అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. అనుమతి తీసుకోకుండా స్కూల్ కి హాజరు కాని రికార్డ్ అసిస్టెంట్ కె.చక్రపాణి, ఆఫీస్ సబార్డినేటర్ కోటేశ్వర్ ను సస్పెండ్ చేయాల్సిందిగా డీఈఓను ఆదేశించారు. పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకి కలెక్టర్ గణిత పాఠాలు బోధించి, విద్యార్థులందరూ ఇప్పటి నుండే వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.

విద్యార్థులందరు బాగా చదివి పరీక్షలు రాసి మంచి మార్కులు తీసుకురావాలన్నారు.. పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎవరు కూడా స్కూల్ కు రాకుండా ఉండకూడదన్నారు. అనంతరం మునిపంపుల, దుబ్బాక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను క‌లెక్ట‌ర్ పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్ల‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ లాల్ బహదూర్ ఉన్నారు.