calender_icon.png 7 December, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. ప్రమాదం అంచున ఆలయం

13-11-2025 12:00:00 AM

  1. ప్రమాదపు అంచున మట్టపల్లి నృసింహుడి మహా క్షేత్రం

ఎగువనుంచి దిగువకు పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణమ్మ

మట్టపల్లి లక్ష్మీ నరసింహుడికి వదలని వరద తాకిడి

కరకట్ట నుంచి లీకవుతున్న కృష్ణ వరద నీరు

హుజూర్ నగర్, నవంబర్ 12 : కృష్ణమ్మ ప్రవాహం నృసింహుడి ఆలయాన్ని ప్రమాదంలోకి నేడుతోంది.ముంచెత్తుతున్న వరదలు, ఆలయ ముంపునకు ప్రతి సారి కారణమవుతున్నాయి. ప్రతి రెండేళ్లు,మూడేళ్లకోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది వరదలతో భక్తులతో పాటు, ఆలయ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. కృష్ణమ్మ చెంతన దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నీటి వరద పెరుగుతుండటంతో మట్టపల్లి ఆలయం ముంపు అంచులో ఉంది.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వస్తున్న వరద నీరు ప్రతి ఏటా ఆందోళనకు గురిచేస్తుంది.  ఎగువ కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరడంతో మట్టపల్లి ఆలయం వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో అది అర్ధరాత్రి లేదా అపరాత్రి అనేది కృష్ణమ్మ వేగాన్ని అంచనా వేసి చెప్పగలిగే పరిస్థితి లేదనేది చెప్పక తప్పదు.

ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం  ఉండి నిండుకుండను తలపిస్తోంది. గత మూడేళ్ల క్రితం నీటిలో మునిగిన స్వామివారు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని భక్తులు మనోవేదనకు చెందుతున్నారు. గతంలో రూ.3కోట్లతో కరకట్ట నిర్మించిన మట్టపల్లి లక్ష్మీ నరసింహుడికి వరద తాకిడి వదిలేలాలేదు అని చెప్పక తప్పదు. ఎగువనుంచి దిగువకు పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణమ్మను చూసి సంబురపడాలో... లేదా 2020లో వచ్చిన వరదల మాదిరి గుడిగర్భ గృహం మునిగిపోతుందా అనే భయం భక్తులను వెంటాడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదగిరిగుట్టగా పేరుపొందిన మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. స్వామి వారికీ నిత్యపూజలు,నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవాలతో పాటు తమిళనాడుకు చెందిన ముక్కూరి పీఠం వారు యజ్ఞాలు, పుష్కరాలు, భక్తుల ఇష్టదైవంగా కొలువుదీరి, నెలకు లక్షల్లో ఆదాయం ఉన్న స్వయంభువుడికి ప్రకృతి వైపరీత్యాలు మాత్రం శాపంగా మారాయి.

కృష్ణానది తీర ప్రాంతాల్లోకెల్లా పంచనారసింహ ఆలయాల్లో ఒకటై ఎంతో పరమ పవిత్ర ఆలయంగా, కోరిన భక్తులకు కొంగుబంగారమై మట్టపల్లి నృసింహడి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుబట్టి నిధులు మంజూరు చేయించడంలో నాటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించారు.ఆనాటి అభివృద్ధి మాంత్రికుడు మంత్రి ఉత్తమ్ సారథ్యంలో రెండు రాష్ట్రాలను కలిపే కీలక నృసింహ వారధిని నిర్మించడంతో హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది.

ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, నాపరాయి, రంగురాళ్లకు ధీటురాయిగా ఉన్న ప్రాంతం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ అనంతరం వరద ముంపునకు గురవుతుంది. గత 2020 ఆగస్టు నెలలో ఆలయం వరద ముంపునకు గురికాగా నాలుగు రోజులపాటు లక్ష్మీనరసింహుడు నీటిలో మునిగిపోయినా పూజారులు, అర్చకులు మెడ వరకు నీటిలోతులో గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారికి ఆర్జిత సేవలు అందించారు.

భక్తులు కూడా స్వామి దర్శనానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలకు కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరదనీటితో ఆలయ కరకట్ట లీకేజీ కావడతో ఆలయంలోకి వరద నీరు చేరుతుంది. ప్రసుత్తం పుష్కర ఘాట్లు మునిగి, కరకట్ట నుంచి లీకేజీ అవుతుండడంతో నీరు ఆలయంలోకి వచ్చిన వరద నీరును పాలకవర్గం వారు రెండు హైస్పీడ్ మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు.

కృష్ణమ్మ పరవళ్ళు తొక్కినప్పుడు.. కరకట్ట లీకేజీ 

పులిచింతల ప్రాజెక్టు నీటి వరద పెరుగుతుండడంతో మట్టపల్లి ఆలయానికి ప్రమాదం నెలకొని ఉంది. సాధారణంగా ప్రాజెక్టులో సుమారు 32 టీఎంసీల నీరు నిల్వ ఉంటే పుష్కరాల ఘాట్లు,ఆలయ మెట్లు మునిగిపోతాయి.అదే 36 టీఎంసీలు ఉన్న నీటినిల్వతో మట్టపల్లి ఆలయంలో కరకట్ట లీకేజీ ద్వారా ఆలయంలో వరదనీరు చేరుతోంది. ఆలయం చుట్టూ మొత్తం 21 అడుగుల మేర గతంలో కరకట్ట నిర్మాణం చేపట్టారు.ఇందులో ఐదు అడుగుల నుండి కొన్ని చోట్ల లీకేజీ అవుతోంది. దీంతో ఆలయ ప్రాగణంలోకి వరద నీరు చేరుతుండటంతో, రెండు మోటార్ల ద్వారా బయటకు తిరిగి పంపుతున్నారు.

వరదనీటి ప్రవాహం పరిస్థితిపైనే మట్టపల్లి ఆలయ దీనస్థితి ఆందోళ కలిగిస్తోంది.ఇప్పటికైనా మట్టపల్లి నృసింహుడి ఆలయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి దేవాలయంలో పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం, లీకేజీ రాకుండా మరో కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన భక్తులు కోరుతున్నారు.

లీకేజితో ఇబ్బందులు పడుతున్నాం 

హుజూర్ నగర కరకట్ట నుంచి నీరు లీకేజీ కావడం వల్ల భక్తులు చాలా ఇ  బ్బందులకు పడుతున్నారు. మంత్రి ఉత్తమ్ సార్ ప్రత్యేక దృష్టి సారించి పంచనారసింహాలలో ఒకటైన మట్టపల్లి నరసింహుడి ఆలయానికి పూర్తిస్థాయిలో నీరు లీకేజీ కాకుండా కరకట్టను నిర్మించి, పర్యాటక కేంద్రంగా గుర్తించాలి

నల్లగొండ గోపి, భక్తుడు, 

భక్తులకు ఇబ్బందులు కలగకుండా నీటిని తొలగిస్తున్నాం 

గతంలో నిర్మించిన కరకట్ట కొన్ని చోట్ల లీకేజీ అవుతోంది. దీంతో ఆలయ ప్రాగణంలోకి వచ్చిన వరద నీరును ఎప్పటికప్పుడు అప్రమత్తమై భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు మోటార్ల ద్వారా నీరును బయటకు తిరిగి పంపుతున్నాము.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో కరకట్ట నిర్మించాలని విన్నవించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాము.ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్ కుమార్, అనువంశిక ధర్మకర్తలు, మట్టపల్లి దేవాలయం