28-09-2025 06:15:04 PM
అచ్చంపేట జనగర్జనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి జలాశయ ఎత్తును ఐదు మీటర్ల మేర పెంచేందుకు 70 వేల కోట్ల రూపాయల భారీ వ్యయ ప్రణాళికను సిద్ధం చేసిందని, అదే గనక అమలైతే రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనదిగా ఉన్న కృష్ణమ్మ తడి ఆరిపోతుందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరి నల్లమల్ల పులిబిడ్డగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆల్మట్టిని ఆపే దమ్ము లేదా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అచ్చంపేటలో ఏర్పాటు చేసిన జనగర్జనకు ఆయన హాజరయ్యారు.
కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీతో చర్చించి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకునే ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా లేడా అని సూటిగా ప్రశ్నించారు. నల్లమల పులిబిడ్డగా పేరు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి పిల్లి లాగా మౌనంగా ఉండటమేంటని ఎద్దేవా చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో జూరాల, శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు ప్రశ్నార్థకమవుతాయన్నారు. ఆల్మట్టిని ఆపే ధైర్యం సత్తా లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు నేతలు దండులాగా కదిలి ఆల్మట్టిని ఆపేస్తామన్నారు. ప్రజలకు అలవికాని హామీలు ఇస్తూ ఓట్లు దోచుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఆయన మండిపడ్డారు.