28-09-2025 07:03:02 PM
మున్సిపల్ యూనియన్(CITU) రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అంబేద్కర్ భవనంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు) జిల్లా 3వ మహాసభ ఆదివారం జరిగింది. కామ్రేడ్ ఎస్కె యాకుబ్ జిల్లా అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కాలంలో చనిపోయిన నాయకులకు, కార్మికులకు అందరికి 3వ మహాసభ సందర్బంగా సంతాపం ప్రకటించారు. ఈ మహాసభకు ముఖ్య అతిధి మున్సిపల్ యూనియన్(CITU) రాష్ట్ర కార్యదర్శి సావనపేల్లి వెంకటస్వామి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కార్మికులను శ్రమ దోపిడికి గురిచేస్తుందన్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, జీవో ఉన్నప్పటికీ మున్సిపల్ కమిషనర్లు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదనీ విమర్శించారు.
కార్మికులకు జమ చేయాల్సిన ఈఎస్ఐ డబ్బులు కూడా జమ చేయడం లేదన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు వైద్య సదుపాయాలు అందక చనిపోతున్నారనీ వాపోయారు. ఒక్క పూట పని విధానం అమలుచేయాలనీ డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పని చేయలేని సిబ్బంది స్థానంలో వారి కుటుంబాలకు ఉద్యోగం కల్పించడంలేదన్నారు. 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఓనర్ కం డ్రైవర్ స్వచ్ఛత ఆటో డ్రైవర్లను అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలన్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ తారీకు లోపు వేతనాలు ఇవ్వాలన్నారు. మా సిఐటియు నాయకులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్, సంకె రవి, చల్లూరి దేవదాస్ రవి శ్రీనివాస, ప్రభాకర్ రాజేష్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.