04-08-2025 01:24:46 AM
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మానవీయతను, మంచి మనసును చాటుకున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న యువతికి కేటీఆర్ అండగా నిలిచారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గోదావరి ఖనికి చెందిన మైనార్టీ యువతి ఆఫ్రీన్(28) ఉపాధి కోసం ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి ఒమన్ వెళ్లింది. అక్కడ ఆమెను డొమెస్టిక్ వర్కర్‌గా నియమించారు. అయితే ఆ తర్వాత ఆమెను అక్కడి యజమాని తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకొని మరొక చోట పనిచేసినా, అక్కడ కూడా ఇదే రకమైన వేధింపులను ఎదుర్కొన్నది.
ఆమె సమస్య పార్టీ కార్యకర్త ద్వారా కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఆయన ఆదేశాల మేరకు రామగుండం పార్టీ నాయకుడు హరీశ్‌రెడ్డి ఆఫ్రీన్‌ను తిరిగి సొంత ఊరికి చేరుకునేందుకు సహాయం చేశారు. కేటీఆర్ కార్యాలయ సహకారంతో భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి, అక్కడి ఏజెంట్‌కు రూ. 1,20,000 ఆయన చెల్లించారు. ఈ మొత్తం చెల్లింపు తర్వాత ఆమెను సురక్షితంగా హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆఫ్రీన్.. కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆఆర్‌కు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలియజేశారు.