25-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): కేసీఆర్ హయాంలో ఫోన్లలో మా ట్లాడేందుకు బీఆర్‌ఎస్ నేతలే భయపడేవారని, ‘ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు కొంతమంది బచ్చగాళ్లవి’ అని స్వయంగా గతంలో కేటీఆరే అంగీకరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాను. కానీ ఫోన్ ట్యాపింగ్ వంటి నీచమైన రాజకీయాలను కేవలం కేసీఆర్ సర్కారు హయాంలోనే చూశానని విమర్శించారు. శనివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు. పోలీసు, ఇం టెలిజెన్స్ వంటి వ్యవస్థలను సొంత పార్టీ నేతలను, ప్రతిపక్ష పార్టీ నేతలను, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుకోవడం బీఆర్‌స్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. సెక్షన్ సీఆర్‌పీసీ 160 ప్రకా రం నోటీసులిచ్చి సాక్షులుగా విచారణకు పిలిస్తే కేటీఆర్, హరీశ్‌రావుకు భయమెందుకని ప్రశ్నించారు. రాజీకీయ కక్ష సాధించా లంటే వేరే నోటీసులిచ్చి కేసీఆర్, కేటీఆర్ అరెస్టు అయ్యేవాళ్లని పేర్కొన్నారు.
గతంలో ఏ విచారణకైనా సిద్ధం అని ప్రగల్భాలు పలికిన కేటీఆర్, ఇప్పుడు నోటీసులు రాగానే డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిర్ధోషులైతే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఫోన్ ట్యా పింగ్ వ్యవహారం అత్యంత దుర్మార్గమని, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడటం ఏ సంస్కృతిని సూచిస్తుందో బీఆర్‌స్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేలాల్సి ఉందని, నిజాలు బయటకు రావడం ఖాయమని చెప్పారు. రాజకీయ నాయకులు చట్టానికి అతీతులు కాదని, తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.