calender_icon.png 25 January, 2026 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ లీగల్ ఫైట్!

25-01-2026 12:00:00 AM

బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లకు నోటీసులు

  1. ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు
  2. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
  3. ఐదు రోజుల్లోగా స్పందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి) : తనపై, తన కుటుంబం పై నిరాధారమైన, పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గానూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్‌లకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యా ఖ్యలను కేటీఆర్ తీ వ్రంగా పరిగణించా రు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. ఎ లాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశం పూర్వకంగా, నీచమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ... చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారని, ఈ మేరకు బండి సంజయ్, అరవింద్‌లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు.

బండి వ్యాఖ్యలు అవాస్తవమని..

 బండి సంజయ్‌కు పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు.

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కషి చేసిన మాజీ మంత్రి అని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసులో వివరించారు.

ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యా ఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేటీఆర్‌కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.