25-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగ ఉల్లంఘన అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే విచారణను ఆలస్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పర సహకారంతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టపోయిన ప్రజలకు న్యాయం చేయాలంటే విచారణను వేగవంతం చేసి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శనివారం జననాయక్ భారతరత్న కర్పూరి ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాం చందర్‌రావు ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల దష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ ఇతర వ్యవహారం నడుస్తోందని, దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.
షిరిడీ సాయిపై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
కొంతకాలంగా కొంతమంది షిరిడీ సాయిబాబాపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నా రు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు బీజేపీ విధానాలకు పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీజేపీ సమాజంలో ఐక్యతని, మతసామరస్యాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తుంది కానీ, వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలను ఎప్పటికీ సమర్థించదు అన్నారు. కోట్లాది మంది షిరిడీ సాయిబాబా భక్తుల మానోభావాలను కించపరిచే విధంగా కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ షిరిడీ సాయిబాబా భక్తులందరికీ క్షమాపణ చెప్పాల న్నారు.
ఇకపై భవిష్యత్తులో బీజేపీలో ఉన్న వారు ఎవరూ భక్తుల హృదయాలను గాయ పరిచేటువంటి వ్యాఖ్యలను చేసి సమాజంలో వివాదలకు తావు ఇవ్వరని షిరిడీ సాయి భక్తులకు హామీ ఇస్తున్నాన్నారు. ఈ సమావేశంలో సాయిబాబా భక్తులు రాజవర్ధన్, మంచికంటి ధనుంజయ, గుండా మల్ల య్య, మైనంపాటి ప్రసాద్, పీవీ సాయి, భాను ప్రతాప్, సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లాకప్‌డెత్‌పై ఆరా
కోదాడలో లాక్ అప్ డెత్‌కు గురైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన కర్ల రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వేముల అశో క్, హైకోర్టు న్యాయవాది రామారావు నేతత్వంలో బృందాన్ని కోదాడకు రాంచందర్‌రావు పంపించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన సంఘటనపై వివరాలను తెలుసుకోవాలని సూచించారు.