25-01-2026 12:00:00 AM
వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ సూచన
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
మేడారం, జనవరి 24 (విజయక్రాంతి): దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈనెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో జరగనుంది. ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి సుమారు మూడు కోట్ల మంది ఈసారి జాతరకు వస్తారని అధికారవర్గాలు అంచనా వేశాయి. నాలుగు వేల ఆర్టీసీ బస్సులను భక్తులను మేడారం చేరవేసేందుకు సిద్ధం చేసింది.
ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా మేడారం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక జన సాధారణ (అన్ రిజర్వుడు) రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పీఆర్‌ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు సికింద్రాబాద్ నుంచి, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి నిజామాబాద్ నుంచి, వరంగల్, కాజీపేట, ఖమ్మం, ఆదిలాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. ఈ రైళ్లు పూర్తిగా అన్ రిజర్వుడు రైళ్లు అని, మార్గమధ్యలో అనేక స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు చెప్పారు. మేడారం మహా జాతరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.