14-09-2025 06:32:57 PM
రజాకార్లపై తిరగబడ్డ "పులి"గిల్ల బిడ్డలు
రక్తాక్షరాలతో చరిత్రను లిఖించుకున్న "పులిగిల్ల"
వలిగొండ,(విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలన నుంచి, రజాకార్ల దురాగాతల నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం సాగించిన తెలంగాణ సాయుధ పోరాటం ఘట్టంలో ప్రధాన భూమిక పోషించిన పోరాటాల ఖిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగిన తెలంగాణ సాయుధ పోరాట పర్వంలో వలిగొండ మండలంలోని పులిగిల్ల పోరాటాల ఖిల్లాగా ప్రత్యేక స్థానం పొందింది.
నాడు నిజాం జాగిర్దారి నవాబ్ ఉస్మాన్ వలిభాష ఏలుబడిలో ఉన్న పులిగిల్లలో జాగీర్దార్ ఆధీనంలోని భూముల కౌలు అమ్మకాల విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదంలో గ్రామంలో కొందరు గ్రామస్తులు నక్కల రాజిరెడ్డి, బద్దం నారాయణరెడ్డి, వాకిటి పుల్లారెడ్డిల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులను ఆశ్రయించగా సంఘం సమావేశం ఏర్పాటు చేసి విధానాలను ప్రశ్నించి భూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రజాకార్లపై తిరగబడ్డ జనం
గ్రామ పట్వారి కొలను బుచ్చిరెడ్డి, గుమాస్తా సాతాను రంగయ్యలు జాగీర్దారి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ రజాకార్ల నాయకులు అబ్బాస్ అలీ, ముస్త్యలపల్లి చోటేమియా, ఖాసీం రజావలి సైదుమెయిల్ అనుచరులు నిజాం పోలీసులు గ్రామస్తులపై దాడులు నిర్వహించారు. ఈ దాడులను గ్రామస్తులు, మహిళలు ముకుమ్మడిగా కర్రలు, కారంపొడి, వడిసెలు రాళ్లతో ఎదుర్కొన్నప్పటికీ పోలీసులు గ్రామస్తులపై కాల్పులు జరిపి సంఘం నాయకులను పట్టుకొని చేతులకు సంకెళ్లు వేసి వలిగొండలోని నిజాం పోలీస్ ఠాణకు తరలించేందుకు పులిగిల్లలోని గడిలో వేశారు. దీంతో రెచ్చిపోయిన గ్రామస్తులు జాగీర్దారి గడిపై దాడి చేసి పోలీసులతో పోరుకు దిగి సంఘం నాయకులను విడిపించుకుపోగా ఈ పోరులో బొబ్బల నర్సిరెడ్డి, బండారు మల్లారెడ్డి, కొమ్మిడి హనుమంత రెడ్డి, నక్కల చంద్రారెడ్డి, బుచ్చిరెడ్డి అసువులు బాసారు.
చారిత్రాత్మక వేదిక పులిగిల్ల
నిజాం పోలీసుల, రజాకార్ల ప్రతీకార చర్యలతో నక్కల చంద్రారెడ్డి, నక్కల ఎల్లారెడ్డి నిజాం చేతులలో జైల్లో మగ్గి నక్కల బుచ్చిరెడ్డి, గొల్ల బొందయ్య చనిపోగా యూనియన్ మిలిటరీ చేతులలో పెద్ద పుల్లారెడ్డి రజాకార్ల చేతులలో దొడ్డి ఎల్లయ్య అమరులయ్యారు. పులిగిల్లవాసులను పార్టీ పీడించిన పట్వారి బుచ్చిరెడ్డి, సాతాను రంగయ్యలు సంఘం దళాల చేతిలో హతమయ్యారు.
ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు, జాగీర్ధారి, భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా పోరు సాగించిన తెలంగాణ సాయుధ పోరాట దళాలకు, నిజాం పోలీసుల, రజాకార్ల దాడులకు మధ్య జరిగిన సంఘర్షణలకు పులిగిల్ల వేదికై చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటంలో పులిగిల్ల తన పేరును రక్తాక్షరాలతో లిఖించుకుంది.