calender_icon.png 20 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిడ్‌నైట్ ఇసుక స్మగ్లర్లు

20-08-2025 12:53:34 AM

-ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను 

-డంప్ చేసి అమ్ముకుంటున్న వైనం

-అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ఆరోపణలు

కామారెడ్డి, ఆగస్టు 19 (విజయ క్రాంతి), అక్రమ ఇసుక దందా నిర్వా హాకులు ఏ చిన్న అవకాశం వచ్చిన ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుండడంతో ఇసుక దందా నిర్వాహకులు త హసిల్దారుల వద్ద ఇందిరమ్మ ఇండ్ల కోసం పర్మిట్లు తీసుకొని దర్జాగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు.ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు మండల్లాలో అక్రమ ఇసుక రవాణా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతుంది.

అక్రమ ఇసుక రవాణా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా అన్నచందంగా నడుస్తోంది. మంజీరా పరివాహక  పోతంగల్, సుంకిని, బీర్కూర్, తదితర మండల ప్రాంతాల్లోని సమీప వాగులు నుంచి ఇసుకను రాత్రి,  పగలు తేడా లేకుండా తోడేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇసుక డంపులు ఏర్పాటు చేసుకోని రాత్రి అయ్యిందంటే చాలు భారీ లారీల్లో జేసీబీ, డోజర్లులతో లోడ్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో పలు చోట్ల కొందరు అక్రమంగా ఇసుక డంపులు  చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరిట  ఇసుక రవాణా చేస్తూ రహస్య ప్రదేశాలలో  అక్రమంగా ఇసుకను  డంప్ చేస్తున్నారు. మిడ్ నైట్ ఇసుక స్మగ్లర్లు..డాంప్ చేసిన అక్రమ ఇసుకను రాత్రి వేళల్లో జెసిబి డోజర్లలతో ఇసుకను లారీల్లో రుద్రూర్  బొప్పాపూర్, కోటగిరి, అంబేమ్ వర్ని  చందూర్, మోస్రా నుంచి నిజామాబాద్ కు తరలిస్తు రూ. 35 వేల నుండి రూ. 50 వేల వరకు ఇసుకను అమ్ముకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి లక్షల రూపాయల్లో గండిపడుతోంది.

సామాన్యులు ప్రభుత్వానికి చలాన్ కట్టినా దొరకని ఇసుక అక్రమ దారులకు మాత్రం సులభంగా లభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇసుక రవాణా చేసే వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.