లక్షల నిధులు మందు పాలు
- అసాంఘిక శక్తులకు అడ్డాగా నూతనకల్ రైతు వేదిక!
అధికారుల నిర్లక్ష్యంపై రైతుల కన్నెర్ర
స్పందించకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిక
నూతనకల్, మార్చి1 : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన భవనాలు అధికారుల ఉదాసీనత వల్ల నిరుపయోగంగా మారుతున్నాయి. మండల కేంద్రంలో వెలసిన ’రైతు వేదిక’ నేడు రైతుల చర్చా వేదికగా కాకుండా, అసాంఘిక శక్తులకు నిలయంగా మారిపోవడంపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
గ్రామ శివారులో నిర్మించిన ఈ రైతు వేదికపై కనీస పర్యవేక్షణ కరువైంది. భవనం కిటికీలు ధ్వంసమై, మరుగుదొడ్లు మూలనపడి అపరిశుభ్రతకు పరాకాష్టగా నిలుస్తోంది. పరిసరాల్లో ఎటు చూసినా మలమూత్ర విసర్జనతో దుర్వాసన వెదజల్లుతోంది. పట్టపగలే అడుగు పెట్టాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
మందుబాబుల కేరాఫ్ అడ్రస్
రైతు వేదికలో వ్యవసాయ సలహాలు రావాల్సిన చోట, మద్యం సీసాలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో మందుబాబులు ఇక్కడ తిష్టవేసి అరాచకాలు సృష్టిస్తున్నారు. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో విషసర్పాలు, పురుగులు సంచరిస్తున్నాయి. దీంతో పొలాలకు వెళ్లే రైతులు అటువైపు వెళ్లాలంటే ప్రాణభయంతో వణికిపోతున్నారు.
అధికారులూ.. మేల్కొనాలి..
లక్షల రూపాయల ప్రభుత్వ ఆస్తి ఇలా కళ్లముందే నాశనమవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భవనానికి మరమ్మతులు చేపట్టి, పరిసరాలను శుభ్రం చేయించడంతోపాటు మందుబాబుల ఆగడా లను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని, రైతు వేదికను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి స్పందించకుంటే ఉన్నతాధికారుల కార్యాలయాల ముందు రైతుల పక్షాన ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
రైతు వేదికకు రక్షణ కల్పించాలి
రైతు వేదిక ఊరి చివర ఉన్నందున రక్షణ కరువైంది. ఆకాతాయిలు ఇక్కడ మద్యం తాగి మద్యం సీసాలతో రైతు వేదిక అద్దాలు పగల కొట్టారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు వేదికకు రక్షణ కల్పించాలి.
- బండి అనిల్ కుమార్, గ్రామస్తుడు




