16 June, 2026 | 3:29 AM

‘సర్’ పేరుతో ఓటు హక్కులను హరించే ప్రయత్నాలు

16-06-2026 02:15 AM

సీపీఐ రాష్ట్ర స్థాయి సదస్సులో పలువురు వక్తలు

ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో ఓటు హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు. సదస్సులో ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, మహేంద్ర యూనివర్సిటీ లా డీన్, కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యు డు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని ’సర్’పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకే ’సర్’ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నికల ప్రక్రియలో వివక్షత పెరుగుతోందని విమర్శించగా, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ చట్టాలపై పౌరులకు సంపూర్ణ అవగాహన అవసరమని పేర్కొన్నారు.

ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని సదస్సు వక్తలు పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీనివాస్రావు, ఈటి. నరసింహ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బోస్, బాలనర్సింహ, శంకర్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.