‘వరద’ సమస్యలపై అధ్యయనం
ఆయా ప్రాంతాల్లో డీసీపీ అనురాధ పర్యటన
ఎల్బీనగర్, జూన్ 15 : వానాకాలం సన్నద్ధతపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో డీసీపీ అనురాధ పర్యటించి, క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను పరిశీలించారు. స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేసి, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎల్బీనగర్ లోని అండర్ పాస్ రోడ్డును పరిశీలించి, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల సమయంలో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో సులభమైన ట్రాఫిక్ రాకపోకలకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ లాగింగ్ ప్రాంతాలను (జీఎస్‌ఆర్ కన్వేక్షన్ హాల్) ఎదురుగా ఉన్న రోడ్డు ప్రాంతాలను సందర్శించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర ఎదురయ్యే వరద ముంపు ప్రదేశాన్ని పరిశీలించారు. వానాకాలంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీపీ ట్రాఫిక్ వి.శ్రీనివాసులు, ఎల్బీ నగర్ ఏసీపీ ఎ.కృష్ణయ్య, ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, సీఐ వినోద్ కుమార్, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, సీఐ రవి బాబు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్, ఎస్త్స్ర వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.






