23-08-2025 04:28:25 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖ దిగువనున్న ప్రాథమిక ఆదాయం కలిగిన 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న కుటుంబ పెద్ద పురుష లేదా మహిళ సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన సమయంలో ఒకేసారి 20వేల రూపాయల నగదు సహాయాన్ని కుటుంబానికి అందించడం జరుగుతుందని తెలిపారు. కుటుంబంలో ప్రాథమిక సంపాదన దారుడు మరణించిన రెండు సంవత్సరాలు లోపు ఈ సహాయానికి వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంత్యోదయ అన్నా భీమా యోజన, జన శ్రీ బీమా యోజన కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టం చేశారు.
ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని, దరఖాస్తు తో పాటు, మరణించిన వ్యక్తికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం ,వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా రుజువు, దారిద్ర్య రేఖకు దిగువనున్నట్లు తెలిపే రేషన్ కార్డు లేదా ధ్రువ పత్రం జత చేయాలని, అదేవిధంగా సహాయం పొందేందుకు దరఖాస్తు చేసిన కుటుంబ సభ్యునికి సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా రుజువు,వయస్సు, కుటుంబ సభ్యుని ధ్రువపత్రం ,ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా వివరాలతో పాటు, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను జత చేసి సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.నల్గొండ జిల్లాకు జాతీయ కుటుంబ ప్రాయోజన పథకం కింద 3500 మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందువల్ల జిల్లాలోని అందరూ గ్రామపంచాయతీ కార్యదర్శులు జనవరి ఒకటి, 2024 నుండి మరణించిన వారి వివరాలను మరణ రిజిస్టర్ ఆధారంగా తక్షణమే ఎంపీడీవోలకు పంపించాలని ఆదేశించారు.
ఎంపీడీవోలు పరిశీలనానంతరం జాబితాలను తహసిల్దార్లకు సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు జాబితాను పంపించాలని చెప్పారు. ఈ పథకం కింద జిల్లాలో అర్హత ఉన్న వారందరూ లబ్ధి పొందే విధంగా ఆర్డీవోలు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఏపీఎంలు కృషి చేయాలని ,ప్రత్యేకించి మండల ప్రత్యేక అధికారులు సైతం ఈ విషయంపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని పర్యవేక్షించాలన్నారు .ఆర్ డి ఓ సబ్ కలెక్టర్ లు వెంటనే వారి పరిధిలోని ఏపీఎంలు ,తహసిల్దారులు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. వచ్చే శనివారం లోపు దరఖాస్తులన్నింటిని తహసిల్దారులు పూర్తి విచారణ నిర్వహించి ఆర్డీవోకు సమర్పించాలని ,ఆర్డీవోలు ఆన్లైన్ ద్వారా జిల్లా రెవిన్యూ అధికారికి పంపించాలని, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అర్హత ఉన్న దరఖాస్తులను పంపించడం జరుగుతుందని కలెక్టర్ చేశారు. ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పథకం కింద దరఖాస్తులను పంపించాలని సూచించారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తదితరులు మాట్లాడారు .