23-08-2025 04:40:27 PM
- క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూసే నిందితుడు
- ప్రణాళిక ప్రకారమే దొంగతనం
- దొరికిపోతాననే హత్య
- వివరాలు వెల్లడించిన సిపి అవినాష్ మహంతి
గచ్చిబౌలి (విజయక్రాంతి): కూకట్పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police Station) పరిధిలో జరిగిన బాలిక హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్లిన మైనర్ బాలుడు(14) దొంగతనం చేసేటప్పుడు చూసిన బాధిత బాలిక సహస్ర అరవడంతో విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mohanty) కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. నిందితుడు మైనర్(14), బాధిత కుటుంబాలు పక్కపక్కన భవనాలలో ఉంటున్నారు. సహస్ర సోదరుడు, నిందితుడు కలిసి క్రికెట్ ఆడుకునే వారు, సహస్ర సోదరుడి ఏం.ఆర్.ఎఫ్. బ్యాట్ ను నిందితుడు ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఆ బ్యాట్ ను ఎలాగైనా దొంగిలించాలని నిశ్చయించుకున్న నిందితుడు ఈ నెల 18వ తేదీన బ్యాట్ ను దొంగిలించడానికి వెళ్ళాడు.
ఇంట్లో నుండి అందరూ బయటికి వెళ్ళారని భావించిన నిందితుడు, ఇద్దరి ఇండ్లు పక్కపక్కనే ఉండటంతో నిందితుడి ఇంటిపై నుండి బాదితుల ఇంటి పైనకు దూకి బాధితులు ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళాడు, ఆ సమయంలో సహస్ర టీవీ చూస్తూ ఉండటంతో వెనకాల నుండి వెళ్ళి వంట గదిలో ఉన్న బ్యాట్ ను తీసుకొని వెళ్తున్న నిందితుడిని చూసిన సహస్ర గట్టిగా అరవడంతో తన దొంగతనం బయటపడుతుందని భయంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో సహస్రని విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సహస్ర తండ్రి జీవచ్ఛవంలా పడి ఉన్న సహస్రను చూసి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీస్ లకు దొరకని ఆధారాలు
హత్య కేసు నమోదు చేసిన పోలీసులు పలు రకాలుగా అనుమానితులను విచారించిన వారికి నిందితుని గురించి ఆధారాలు దొరకలేదు. ఇంటి ముందు ఉన్న కెమరాలో చూస్తే ఉదయం నుండి ఇంట్లోకి ఎవరు వెళ్లినట్లు లేకపోవడంతో హత్య ఎవరు చేశారో తెలియక పోలీసులు ఒకింత నిరాశ చెందిన సమయంలో భవనంలో ఉంటున్న వారిని చుట్టుపక్కల వారిని విచారించిన సమయంలో పక్క భవనంలో ఉంటున్న 14 సంవత్సరాల బాలుడు ఉదయం చాలా సేపు పక్క భవనం పై అంతస్తులో ఉన్నట్లు తెలియడంతో నిందితున్ని విచారించిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో నిందితుని ఇంట్లో సోదా చేసి హత్యకు వాడిన కత్తి, దొంగతనం ఎలా చేయాలని అతడు రాసుకున్న లెటర్, ఏం.ఆర్.ఎఫ్. బ్యాట్ ను స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించారు.
ఒక బ్యాట్ కోసం హత్య చేయడం ఏంటి అనే విషయం పోలీసులు విచారించగా, నిందితుడి కుటుంబం ఆర్ధికంగా బాగాలేకపోవడంతో తల్లితండ్రులను బ్యాట్ కొనియమని అడగం ఇష్టం లేక ఈ పని చేశానని నిందితుడు పోలీసుల ఎదుట చెప్పాడు. ఎక్కువగా క్రైమ్ సినిమాలను ఓ.టి.టి. లో చూసే అలవాటున్న నిందితుడు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో సినిమాలు చూడటం, క్రికెట్ ఆడుతుంటాడని పోలీసులు తెలిపారు. బ్యాట్ దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డువస్తే వారిని కత్తితో గాయపరిచి పారిపోవాలని ముందుగానే ప్రణాళిక వేసుకొని దొంగతనానికి వెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్న నిందితుడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మైనర్లు, యువతీయువకుల పట్ల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు నిఘా ఉంచాలని, వారి ప్రవర్తన గుర్తిస్తూ తప్పుదారిలో వెళ్లకుండా చూసుకోవాలని సిపి తెలిపారు.