23-08-2025 04:22:52 PM
గోదావరి నదిలోకి 46 టీఎంసీలు..
కొనసాగుతున్న నీటి విడుదల..
అర్మూర్ (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project) నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండిపోయింది. వర్షాభావ లోటువల్ల పది రోజుల క్రితం వరకు ప్రాజెక్టు వెలవెల బోయింది. తుఫాను కారణంగా ఎగువ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురడంతో లక్షలాది క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 80 టీఎంసీల సామర్థ్యము కలదు. శుక్రవారం నాటికి పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండు కుండలా మారింది. ఈ వానకాల సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ప్రాజెక్టులోకి 128 టీఎంసీల వరద నీరు వచ్చింది.
వరద గేట్ల ద్వారా సుమారు 47 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు నిండికుండలా మారడంతో యాసంగి పంటలకు సాగుకు డోకా లేకుండా పోయింది. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వరద కాలువ ద్వారా నీటిని వదులుతూ కరీంనగర్ జిల్లాలోని మద్య మానేరు డ్యామ్ నింపుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టుగా ఉన్న జల విద్యుత్తు ఉత్పాదన కేంద్రంలోని నాలుగు టర్బన్ల ద్వారా ఈ సీజన్లో సుమారు 37 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. వరద కొనసాగుతున్న దృష్ట్యా విద్యుత్తు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.
16 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల
ఎగువ ప్రాంతం నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతోంది. శుక్రవారం 78 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 79 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇందులో వరద గేట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని, కాకతీయ కాల్వ ద్వారా 6500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లక్ష్మి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీరు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీరు చొప్పున వదులుతున్నారు. ఇదిలా ఉంటె ఈ నెల 18 నుంచి 22 వరకు అయిదు రోజుల్లో 46 టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి వదలడం విశేషం. ఇది మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో సుమారు 80 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదలడం విశేషం.