09-05-2025 10:41:41 PM
రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధి గుండా వెళ్తున్న 163జి గ్రీన్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో జాతీయ రహదారి 163జి, కాలా ప్రాజెక్ట్ పనుల పురోగతి పై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీజిఎం ఆర్వో శివశంకర్, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యా రాణి లతో కలిసి జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి హరిచందన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ లో మంచిర్యాల నుండి భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల మీదుగా ఖమ్మం నుండి విజయవాడ వరకూ (నాగపూర్ -విజయవాడ) నిర్మించే 163జి గ్రీన్ ఫీల్డ్ ఎకానమిక్ కారిడార్ లో భాగంగా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపులు, తదితర అంశాలపై జాతీయ రహదారుల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి హరిచందన మాట్లాడుతూ రెండో దశ ప్రాజెక్ట్ లో భాగంగా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి పరిధిలో జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
భూసేకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సరస్వతి పుష్కరాల తరువాత భూసేకరణ పనులను మరింత వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పెండింగ్ లో ఉన్న ప్రాంతాల రైతులతో ఆర్బీట్రేషన్ నిర్వహించి పరిహారం చెల్లింపునకు చర్యలు చేపట్టాలన్నారు. భూసేకరణలో భాగంగా రైతులతో అధికారులు మాట్లాడి పరిహారం చెల్లించారు. అదేవిధంగా మామూనూర్ ఎయిర్ పోర్ట్ కనెక్టీవిటి రోడ్లకు సంబంధించిన భూసేకరణపై ఆర్ అండ్ బీ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల శాఖ వరంగల్, ఖమ్మం ప్రాజెక్టు డైరెక్టర్లు దుర్గాప్రసాద్, దివ్య, ఆర్ అండ్ బీఎస్ఈ నాగేంద్ర రావు, ఈఈ సురేష్ బాబు, ఆర్డీవోలు ఎన్. రవి, ఉమారాణి, సత్యపాల్ రెడ్డి రాథోడ్ రమేష్, నారాయణ, తహసీల్దార్లు, జాతీయ రహదారుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.