10-05-2025 07:28:19 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): మైనర్ లు డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. ఈ నెల 5వ తేది నుండి వారం రోజులపాటు సూర్యాపేట పట్టణ, రూరల్ పరిధిలో పట్టుబడిన 73 మంది మైనర్ పిల్లలు, వారి తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్ లో వాహన చట్టాలు, రోడ్డు భద్రత, ప్రభుత్వం అమలోకి తెచ్చిన కొత్త నిభందనలు, జరిమానా, శిక్షలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ రోడ్డు భద్రతా నియమాల పట్ల పటిష్టంగా పనిచేస్తుందన్నారు, దానిలో భాగంగా ఈనెల 5వ తేదీ నుండి వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 239 మంది పిల్లలను గుర్తించి వాహనాలు సీజ్ చేశామన్నారు. అలాగే వారి తల్లిదండ్రులను పిలిపించి మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి పార్థసారథి, పట్టణ సిఐ వీర రాఘవులు, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సైలు ఆంజనేయులు బాలు నాయక్, సాయిరాం, ఏడుకొండలు, ప్రవీణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.