మైసమ్మ ఆలయ భూములపై కబ్జారాయుళ్ల కన్ను..!
- శృతి మించుతున్న మంత్రి జూపల్లి అనుచరుల ఆగడాలు
గుట్టలను ధ్వంసం చేసి వెంచర్లకు మట్టిని తరలించిన ఘనులు
ఆలయ భూమికి పక్కనే ప్రైవేటు వ్యక్తులచే కొనుగోలు
పట్టా భూమి మాదే అంటూ ఆలయ భూమి ఆక్రమణకు యత్నం
ఫిర్యాదు చేసినా స్పందించని అధికార యంత్రాంగం
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 1 విజయక్రాంతి కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం నాయనోన్ పల్లి మైసమ్మ ఆలయ భూములపై ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఎండోమెంట్ పరిధిలోని ఆలయ భూమికి ఆనుకొని పక్కనే ఉన్న ప్రైవేటు రైతుల వద్ద కొనుగోలు చేసి భూమిని చదును చేస్తూ పట్టా భూమి అంటూ 10 గంటలకు పైగా ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆలయ భూములకు రక్షణ కల్పిస్తూ సర్వే చేపట్టాలని ఆలయ అధికారులు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఇదే అదునుగా భావించిన అధికార పార్టీ ఖద్దరు లీడర్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు చెప్పుకొని ఆలయ భూమిని చదును చేశారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ ప్రాంతంలో ప్లాట్లు కూడా నిర్మాణం చేసి సిసి రోడ్డు కూడా వేసినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న బిజెపి పార్టీ నేతలు ఆలయ భూమిని రక్షించాలని తాసిల్దార్ శ్రీనివాసులను కోరుతూ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకపోవడం వెనక రాజకీయ ఒత్తిడా లేక కబ్జారా యుళ్ళతో అధికారులు చేతులు కలిపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సుమారు 26 ఎకరాలు కలిగిన నాయినోనిపల్లి మైసమ్మ ఆలయ భూములకు క్రమంగా రక్షణ లేకుండా కబ్జా పర్వం అవుతున్నాయని ఆలయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆలయ కమిటీ కూడా తెర వెనుక కబ్జారాయుళ్ళకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
శృతి మించుతున్న మంత్రి అనుచరుల ఆగడాలు.!
గత పదేళ్లు బిఆర్‌ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు అణిచివేతలు విసిగి వేసాగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ గత నేతలు చేసిన తప్పులే మళ్ళీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు కిందిస్థాయి కార్యకర్తలను అదుపులో ఉంచకపోవడంతో వారి ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అవినీతి అక్రమాలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని దాని ఫలితంగానే సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు నేతలు ఘోర పరాజయం పాలయ్యారని జోరుగా చర్చ జరుగుతోంది.
అయినప్పటికీ గుణపాఠం నేర్వని కిందిస్థాయి ఖద్దరు నేతలు కనిపించిన కాళీ జాగాలను ప్రభుత్వ భూములను గుట్టలను వదలకుండా రాత్రికి రాత్రే పాగా వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కిందిస్థాయి నేతల వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు పలుమార్లు మందలించినట్లు చర్చ జరుగుతుంది.
అయినప్పటికీ పోలీస్ రెవెన్యూ ఇతర ఆయా శాఖల అధికారులతో చేతులు కలిపి వారి సహకారంతో అక్రమాల పనులు కానిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దకొత్తపల్లి మండల పరిసరాల్లోని భారీ గుట్టలను ధ్వంసం చేసి ఎర్రమట్టిని తరలించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నేతలే ప్రస్తుతం మైసమ్మ తల్లి ఆలయ భూములపై కూడా కన్నెసారని స్థానికంగా చర్చ జరుగుతుంది.
నాయినోని పల్లి గ్రామ శివారులోని 112బి లో 35 గుంటలు, 112/అ /3లో 13గుంటలు, 112అ /2లో 29 గుంటలు, 112అ /1లో 4.18 గుంటలు, 112ఆ లో 35గుంటలు, 112ఆ /2లో 29 గుంటలు, 112అ లో 36 గుంటలు, 119అ లో 6.03 గుంటలు, 119అ లో 6.29 గుంటలు, 120అ లో 3 ఎకరాల చొప్పున మొత్తం 26 ఎకరాల్లో ఆలయ భూమి ఉన్నది కానీ 120 సర్వే నెంబర్ లోని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన ఎకరం పొలాన్ని ఎక్కువ మొత్తంలో ఆలయ భూమిలోకి చొరబడి విలువైన 10 గుంటల భూమిని కబ్జా చేసేందుకు కబ్జారాయిళ్లు యత్నిస్తున్నారని ఆలయ భూములను కాపాడాలని కోరుతూ బిజెపి పార్టీ లీడర్లు స్థానిక తహసిల్దార్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆలయ భూములను కాపాడాలి
ఎంతోమంది భక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉన్న మైసమ్మ ఆలయ భూ ములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. ప్రస్తుతం ఆలయ భూమికి ఆనుకొని కొంతమంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇతర నిర్మాణాలు చేస్తున్నట్లు స్థానిక తహసిల్దార్ కు రాతపూ ర్వకంగా ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవిస్తాం.
రామేశ్వర శర్మ, ఆలయ ఈఓ, నాయినోనిపల్లి మైసమ్మ ఆలయం, నాగర్ కర్నూల్.




