18 April, 2026 | 4:32 AM

భూ భారతి చట్టంతో భూ సమస్యలు దూరం

10-06-2025 12:34 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 9 (విజయక్రాంతి): నూతన భూ భారతి చట్టం అమలుతో ప్రజల భూ సమస్యలు దూరమవుతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు, ప్రజల భూ సమస్యల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ప్రజల భూ సమస్యల దరఖాస్తులను తీసుకొని, వారికి రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. భూ భారతి చట్టాన్ని అనుసరించి ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల నుంచి స్వీకరించిన భూ సమస్యలకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లలో అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సహాయ కేంద్రం (హెల్ప్ డెస్క్)ను పర్యవేక్షించి, పలు వివరాలపై ఆరా తీశారు.  ఈ పరిశీలనలో  కలెక్టర్ వెంట తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.