02-01-2026 12:00:00 AM
జూనియర్ సివిల్ జడ్జ్ కీర్తి చంద్రిక రెడ్డి
ఇల్లందు టౌన్, జనవరి 1 (విజయక్రాంతి): న్యాయవాదులు కేసుల వాదనలకే పరిమితం కాకుండా ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా సేవా దృక్పథంతో పనిచేయాలని ఇల్లందు జూనియర్ సివిల్ జడ్జ్ దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. గురువారం సీనియర్ నోటరీ న్యాయవాది దంతాల ఆనంద్ ఆధ్వర్యంలో రూపొందించిన టెలిఫోన్ డైరెక్టరీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదేళ్లుగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఎంతో ఉపయోగపడే విధంగా టెలిఫోన్ డైరెక్టరీని రూపొందించి ఉచితంగా అందజేయడం ప్రశంసనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు న్యాయవృత్తికి గౌరవాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
న్యాయవాదులు తమ వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, న్యాయవృత్తి ప్రారంభం నుంచే దంతాల ఆనంద్ ప్రజాహిత కార్యక్రమాల్లో ముందుండి సేవా స్పూర్తితో పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన చేసిన సేవలను న్యాయవాదులు, పట్టణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచు కుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ టి. ఇందిరా, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.