02-01-2026 06:04:49 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని మండల విద్యాధికారి రాథోడ్ సుబాష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోయల్స్ పాఠశాలలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళశాసనాలతో, తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో విద్యార్థుల జాగృతి కోసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు “కృతజ్ఞత, సమానత్వ భావన” అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించగా జిల్లాలోని సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ రాథోడ్ సుబాష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహాయం చేసే ప్రతి ఒక్కరిపట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలని, అందరినీ సమానత్వంతో చూడాలని సూచించారు. సమయపాలన పాటిస్తే క్రమశిక్షణ అలవడుతుందని, అదే మన లక్ష్య సాధనకు మార్గమని తెలిపారు.
రాబోయే పదవ తరగతి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి జిల్లాకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. సెయింట్ జోయల్స్ పాఠశాల ప్రిన్సిపాల్ దేవభూషణం మాట్లాడుతూ, విద్యతో ఏదైనా సాధించవచ్చని, సమాజంలో విద్యావంతులకు ఉన్నత స్థానం ఉంటుందని తెలిపారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఎంఈఓ రాథోడ్ సుబాష్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.