03-09-2025 06:25:13 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): తెలంగాణ బార్ కౌన్సిల్ జేఏసీ పిలుపుమేరకు మంగళవారం అర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోడ ప్రతులను బార్ అసోసియేషన్ హాలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోక భూపతి రెడ్డి, బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులే కాకుండా హత్యలు కూడా జరుగుతున్నాయని వాపోయారు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలు సైతం నిర్వహించకపోవడం సరైనది కాదని వెంటనే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలను నిర్వహించవలసిన అవసరం ఉందని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల న్యాయవాదులకు న్యాయం జరగడానికై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తికి భంగం కలగకుండా, ఇబ్బందులు కలగకుండా ఏ విధంగానైతే వైద్యులకు డాక్టర్స్ ప్రొడక్షన్ యాక్ట్ తెచ్చారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యావాదులకు న్యాయవాదుల రక్షణ చట్టంతో పాటు అన్ని రకాల రక్షణ, సహాయ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు.