15-11-2025 04:48:32 PM
చేవెళ్ల: లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ తెలంగాణ, చేతన పేరుతో రూపొందించిన సమగ్ర బాలల రక్షణ, లైఫ్ స్కిల్స్ కార్యక్రమాన్ని శనివారం చేవెళ్ల మండలంలోని టీ.జీ.ఎం.ఎస్, జడ్.పీ.ఎచ్.ఎస్ బాయ్స్, జడ్.పీ.ఎచ్.ఎస్ గర్ల్స్, కేజీబీవీ, జడ్.పీ.ఎచ్.ఎస్ దేవుని ఎర్రవల్లి పాఠశాలల్లో చేవెళ్ల మండల విద్యాధికారి శ్రీ పురందాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. చేతన కార్యక్రమం, భవిష్యత్తులో పిల్లలు ఎదుర్కొనే సవాళ్లను సురక్షితంగా, బాధ్యతగా ఎదుర్కొనేందుకు అవసరమైన జ్ఞానం, స్పష్టత, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలను అందించడం కోసం రూపొందించబడిందని, వారిని భవిష్యత్తులో ధైర్యవంతమైన, బాధ్యత, సామాజిక చైతన్యం కల పౌరులుగా ఎదగడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో మాట్లాడిన మండల విద్యాధికారి శ్రీ పురందాస్, పాఠశాలల్లో చేతన వంటి సమగ్ర విద్యను బోధించడం ఎంత ముఖ్యమో వివరించి, ఈ కార్యక్రమాన్ని చేవెళ్ల మండలానికి తీసుకువచ్చినందుకు ఎల్.ఎస్.ఎఫ్ కు అభినందనలు తెలిపారు. టీ.జీ.ఎం.ఎస్ ప్రిన్సిపాల్ శ్రీ ఆర్. చిన్నెపు రెడ్డి, “తెలుసుకోవాలి, మాట్లాడాలి, ‘కాదు’ అని చెప్పగలగాలి” అనే విషయాలను పిల్లలకు నేర్పడం అత్యంత అవసరం అని పేర్కొని, చేవెళ్లలో చేతన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎల్.ఎస్.ఎఫ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎల్ఎస్‌ఎఫ్ ఫౌండర్ శ్రీమతి కౌముది మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి విశ్వాసం, గౌరవం, సరైన సమాచారంతో ఎదగడానికి హక్కు ఉందని, విద్యార్థుల సంక్షేమం కోసం పాఠశాలలతో కలిసి నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు.
ఇప్పటి వరకు లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, బాలల, మహిళల భద్రత, సాధికారత, ఋతు పరిశుభ్రత, విద్య, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం వంటి రంగాల్లో 72,000 మందికి పైగా పిల్లలు, 41,000 మంది పెద్దలతో పని చేసింది. చేతన కార్యక్రమం ద్వారా ఈ ప్రభావాన్ని మరింతగా విస్తరించి, సురక్షితమైన, అవగాహనతో, సామర్థ్యంతో, సహానుభూతితో వ్యవహరించే సమాజాన్ని నిర్మించడం ఎల్ఎస్‌ఎఫ్ లక్ష్యం. కార్యక్రమంలో ఇతర పాఠశాలల సిబ్బంది, లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ ఫౌండర్, సిఈఓ శ్రీమతి కౌముది, డైరెక్టర్ శ్రీమతి హర్ష చావ్లా, ఫౌండేషన్ ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.