01-11-2025 12:56:53 AM
-ప్రైవేట్ ప్లాట్లలో పాగా
-ప్లాట్ల యజమానులకు సెక్యూరిటీతో బెదిరింపులు
-లీజుకు తీసుకున్న భూమి సొంతం చేసుకునే యత్నం
-గ్రామాలను ఎండబెట్టి రిసార్ట్‌కు అక్రమంగా నీటి సరఫరా
-లియోనియో రిసార్టు డైరెక్టర్లలో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి
మేడ్చల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేట్ శివారులోని లియోనియో (ఎల్ ఎమ్ ఐపిహెచ్‌ఎల్) రిసార్ట్ యాజమాన్యం అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్ప డుతోంది. ప్రైవేటు వ్యక్తుల ప్లాట్‌లలో పాగా వెయ్యడమే గాక, లీజుకు తీసుకున్న స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ నాయకుల అండతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లు కబ్జా చేయడమే గాక వారిపైనే అక్రమ కేసులు చేయిస్తోంది.
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి భాగస్వామి కావడంతో అధికారులు అన్ని విషయాల్లో జి హుజూర్ అం టున్నారు. లియోనియో రిసార్ట్ గేటెడ్ కమ్యూనిటీ కాదు. ఇళ్ల స్థలాల వెంచర్ వేసిన వ్యక్తి కొన్ని ప్లాట్‌లలో రిసార్ట్ ఏర్పాటు చేశారు. దీనిని ఇటీవల నలుగురు వ్యక్తులు కొనుగోలు చేశారు. రిసార్టులో ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లు కూడా ఉన్నా యి. 32 ప్లాట్లను ప్రస్తుత యాజమాన్యం కబ్జా చేసి అక్రమంగా వాడుకుంటుంది. ప్రహరీ నిర్మించి గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ తాళాలు పగలగొట్టి వాడుకుంటున్నారు. ఇదేమిటనే ప్రశ్నిం చే వారిపై దౌర్జన్యానికి, బెదిరింపులకు పా ల్పడుతున్నారు. సెక్యూరిటీ సిబ్బం ది తుపాకులతో బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
లీజు ముగిసినా స్థలం ఖాళీ చేస్తలేరు
అచ్యుత్ ఇనిస్టిట్యూట్ కార్యదర్శి కపిల్‌కుమార్‌శర్మకు చెందిన 66,531 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చాడు. లీజు అగ్రిమెంట్ 2024 సెప్టెంబర్‌లో ముగిసింది. 2025 మార్చి ఒకటో తేదీన తన స్థలాన్ని ఖాళీ చేయాలని లియోనియో కు వెళ్లాడు. వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదయిం ది. పైనుంచి ఒత్తిడి రావడం వల్లే పోలీసులు ఆగమేఘాల మీద కపిల్‌కుమార్ శర్మ మీద అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈయన ఇచ్చిన పిటిషన్‌పై మాత్రం పోలీసులు కేసు నమోదు చేయలేదు. చాలా రోజుల తర్వాత ఏప్రిల్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎస్‌టిపి కోసం లియోనియోకు 2009లో కపిల్ కుమార్‌శర్మ 1.20 ఎకరాల భూమి లీజుకు ఇచ్చాడు. రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కొత్త యాజమాన్యం ఆ భూమి తమదినంటూ నోటీసులు ఇచ్చింది.
సీఎం సలహాదారుడి పేరు ప్రస్తావించిన పోలీసు
బాధితులు ఇటీవల జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడుని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రంజిత్‌రెడ్డి అతడి భాగస్వాములు దౌర్జన్యం చేస్తున్నారని, తమ ఫ్లాట్లకు రానీయడం లేదని న్యాయం చేయాలని కోరారు. వెంటనే ఆ నాయకుడు పోలీ సు ఉన్నతాధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో సీఎం సలహాదారు ఇన్వాల్వ్ అయ్యారని ఆ అధికారి చెప్పారు. దీంతో ఆ నాయకుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రిసార్టుకు భగీరథ నీరు
లియోనియో రిసార్ట్‌కు ఎలాంటి అనుమతి లేకుండా మిషన్ భగీరథ నీటి కోసం ఐదు కిలోమీటర్ల పైపులైన్ వేశా రు. ఆర్ అండ్ బీ రోడ్డును ధ్వంసం చేసి కలెక్టర్ కార్యాలయం ముందు నుంచి పైప్‌లైన్ వేసిన ప్పటికీ ఏ అధికారి అడ్డుకోలేదు. ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటంతో అధికారులు చూస్తూ ఉండిపోయారు. ఈ పైపులైన్ వేసినప్పటి నుంచి బొమ్మరాసిపేట్, పొన్నాల, ఉద్దె మర్రి, బాబాగూడా, అద్రాస్ పల్లి గ్రా మాల్లో నీటి కొరత ఏర్పడింది. ఈ గ్రామాలు ఎత్తున ఉండటంతో గతంలో కొద్దిగా నీరు వచ్చేది. లియోనియాకు పైపులైన్ వేసినప్పటి నుంచి సమస్య అధికమైంది. అంతేగాక మిషన్ భగీరథ నీరు అక్రమంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సరఫరా చేస్తున్నారు.
ఎన్సీఎల్టీ టెండర్‌లో నిబంధనలకు నీళ్లు
లియోనియో యజమాని యాంక రుణం చెల్లించకపోవడంతో ఎంసీఏఎల్టి స్వాధీనం చేసుకుంది. బ్యాంకు రుణం రూ.2,218 కోట్లు చెల్లించాల్సి ఉంది. లియోనియో ఆస్తు ల విలువ రూ.2,400 కోట్లుగా నిర్ధారించా రు. కానీ దీనిని జేపీఈఎల్ కంపెనీ రూ.237 కోట్లకే దక్కించుకుంది. ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్విరామరాజు, గడ్డం రంజిత్‌రెడ్డి, అణగందుల తిరుపతిరెడ్డి, ప్రవీణ్‌రావు దీనిని దక్కిం చుకున్నారు. భూమి కొనుగోలుకు ఎక్కడి నుంచి డబ్బులు సర్దుబాటు చేస్తారో కొనుగోలుదారు ముందుగానే ఎన్సీఎల్టీకి తెలియ జేయాల్సి ఉంటుంది.
రామరాజు అనే వ్యక్తి విశాఖపట్నంలోని తన భూములను విక్రయించి డబ్బులు చెల్లిస్తానని ఎంసిఎల్‌టి కి తెలియజేశాడు. విశాఖపట్నం దస్పాల్ హిల్స్‌లోని రూ.190.50 కోట్ల విలువైన 12,700 గజాలు, వాల్తేర్ వార్డులోని రూ.90.86 కోట్ల విలువైన 5,192 గజాల విలువైన భూమి విక్రయిస్తానని తెలిపాడు. వాస్తవానికి ఇందులో ఒకటి ప్రభుత్వ భూమి కాగా, మరొక దానిపై కోర్టు కేసు వివాదం ఉన్నట్లు తెలిసింది. బ్యాంకు ఆర్‌పి ఇవేమీ పట్టించుకోలేదు. ఎక్కడి నుంచి డబ్బులు చెల్లించరనేది వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎన్సీఎల్టీ వేలంలో నిబంధనలన్నీ ఉల్లంఘించారు. దీనిపై విచారణ జరిపితే పెద్ద కుంభకోణం బయటపడే అవకాశం ఉంది.
దౌర్జన్యంగా లాక్కోడానికి ప్రయత్నిస్తున్నారు
మా భూమి దౌర్జన్యంగా లాక్కోవడానికి రంజిత్ రెడ్డి, ఆయన భాగస్వా ములు ప్రయ త్నిస్తున్నారు. నా దగ్గర లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ న్యాయం జరగడం లేదు. నా మీదే అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు అధికారులు భయ పడి వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలి.
కపిల్‌కుమార్‌శర్మ, అచ్యుత్ ఇనిస్టిట్యూట్ కార్యదర్శి
మా ప్లాట్లలోకి రానీయడం లేదు
లియోనియో రిసార్ట్‌లో మాకు ఒక్కొక్కటి వెయ్యి గజాల చొప్పున మూడు ప్లాట్లు ఉన్నాయి. ప్రహరీ నిర్మించి తాళం వేశాము. తాళం పగులగొట్టి దౌర్జ న్యంగా వాడుకుంటున్నారు. ప్లాట్ల వద్దకు రానీయడం లేదు. గేటు వద్ద మాజీ సైనికులను సెక్యూరిటీ గార్డు లుగా పెట్టుకున్నారు. వారు మమ్మ ల్ని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం 32 ప్లాట్లు కబ్జర్వ్ చేశారు. మొత్తం 300 ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రమోద్‌గౌడ్, బాబాగూడా