calender_icon.png 10 September, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం

08-08-2024 12:00:00 AM

రేపు ‘క్విట్ ఇండియా దినం’

మన దేశం ఆగ స్టు 9న 82వ ‘క్విట్ ఇండియా ఉద్యమ దినాన్ని’ నిర్వహించుకుంటున్నది. స్వాతం త్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఈ రకంగా నివాళులు అర్పిస్తున్నాం. సమరానికి కొత్త ఊపును ఇవ్వడంలో ఈ ఉద్యమం నిర్వహించిన పాత్ర అద్వితీయం. ఆనాటి భారతీయులంతా భారీసంఖ్యలో కదం తొక్కడంతో బ్రిటీష్ పాలకుల గుండెలో దడ పెరిగింది. వారి ఆత్మ స్థయిర్యాన్ని ‘క్విట్ ఇండియా’ ఉద్యమం బాగా దెబ్బ తీసింది. పోరాటాన్ని అణచి వేయడానికి సామూహిక అరెస్టులు, లాఠీ చార్జీలు, హింసాత్మక అణచివేతలు, ప్రముఖ నాయకుల అరెస్టులు అనేకం జరిగాయి. ‘పోరు చేద్దాం లేదా ప్రాణమిద్దాం’, ‘సాధిద్దాం లేదా మరణిద్దాం’ అనే తీవ్రస్థాయి నినాదాలు భారతీయుల కర్తవ్య పటిమను చాటాయి.

9 ఆగస్టు 1942న ముంబాయి ‘గోవాలియా ట్యాంక్ మైదానం’లో ప్రారంభమైన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం వెంటనే ఫలితం చూపనప్పటికీ, దాని ప్రభావంతో భరతమాత స్వేచ్ఛను 1947లో పొందడానికి ఎంతో దోహదపడింది. స్వ్రాతంత్య్రం ఇవ్వడానికి ఆలోచనలు ప్రారంభించారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ వంటి అనేక దిగ్గజ నాయకులు ముందు నడుస్తూ ‘క్విట్ ఇండియా’ ఉద్యమం సాగించారు. ఈ పోరులో అనేకమంది ప్రాణత్యాగం చేసి భారత స్వాతం త్య్ర పోరాట చరిత్రలో చెరగని ముద్ర వేశారు. 1857 నుంచి కొనసాగిన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఈ ఉద్యమం అత్యంత ప్రభావాన్ని చూపిన పోరుగా నాటి వైస్రాయ్ అభివర్ణించడం విశేషం. దీనికి నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూస్‌వెల్ట్ కూడా అనుకూలమైన ప్రకటన చేశారు. ‘క్విట్ ఇండియా దినం’ సందర్భంగా ప్రాణాలు అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడం, దేశాభివృద్ధికి ఊతమివ్వడం ప్రతీ పౌరుడి కనీస బాధ్యత. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి