08-08-2024 12:00:00 AM
‘ఉన్నోల్లని కొట్టిండు
లేనోల్లకు పెట్టిండు
పండుగ సాయన్న వాడు
రాజులకు మొనగాడు.’
ఆయన సంపద కలిగిన ధనవంతులను, భూస్వాములను, పెత్తందార్లను గడగడలాడించిండు. అన్యాయంగా, దౌర్జన్యంగా వాళ్లు సంపా దించిన సొత్తునంతా లాక్కున్నడు. దోచుకున్నడు. అదంతా తిండి లేని పేదోల్లందరికీ పంచిండు. వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టిండు. ఆయన బతికి ఉన్నంత కాలం పేదోల్లందరికీ దేవునిలా సహాయం చేసిండు.
ఎవరు ఆయన? తెనుగోల్ల సాయన్న! ఆయనే పాలమూరు ప్రజాబంధు పండుగ సాయన్న. పండు గ సాయన్న పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లా మేరుగోనిపల్లె గ్రామంలోని ఒక నిరుపేద తెనుగు కుటుంబంలో మొహర్రం పండుగ రోజున జన్మించాడు. వందేళ్ల క్రితం తెనుగోళ్లు తోట పనులు చేయ టం, తోటలు పెంచడం, రకరకాల పండ్లు అమ్మటం, చేపలు పట్టడం వంటి పనులే ఆధారంగా జీవించేవారు. అత్యంత పేద కుటుంబంలో జన్మించిన సాయ న్న చదువుకు నోచుకోలేదు.
కుటుంబ సభ్యులతో తోట పనుల్లో నిమగ్నమై చిన్ననాటి నుండి కటిక పేదరికం అనుభవించాడు. బాల్యం నుండే సాయన్న తన ఇరుగు పొరుగు వాళ్ళు పేదరికం వల్ల అనుభవిస్తున్న బాధలను గమనించాడు. వాటన్నింటినీ అర్థం చేసుకున్నాడు. పేదల సంక్షేమం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాడు. తన వయస్సున్న యువకులందరినీ సమీకరించాడు. అప్పట్లో వాడుకలో ఉన్న సాము గరిడెగా పిలువబడే ‘కర్ర సాము’ నేర్చుకున్నాడు. తద్వారా శారీరక వ్యాయామాలను అభ్యసిం చాడు. పేదోల్ల సంపదనంతా దోచుకు తిన్న భూస్వాములను, పెత్తందారులను ఎదిరించాడు. పటేండ్ల సొమ్ము లాక్కుని పేదలకు పంచాడు.
పేదల పాలిట దైవం
తన స్నేహితులతో ‘దళాన్ని’ ఏర్పాటు చేశాడు. ఆ దళానికి తాను నాయకత్వం వహించాడు. ఆరడుగుల ఎత్తు, విశాలమైన శరీరం, గుబురు మీసాలతో సాయ న్న వీరునిగా ఎదిగి సాహస పోరాటాన్ని ప్రారంభించాడు. పేదోళ్ల శ్రమను దోచుకుని అక్రమంగా సంపా దించిన భూస్వాములను ఎదిరించాడు. భూస్వాముల సంపదను పేదోళ్లకు పంచాడు. ప్రజల్లో పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని సాయన్న తన ముఠా తో కలిసి గ్రామగ్రామాన ప్రచారం చేశాడు. ఆనాడు సాయన్న చేసిన సహాయాన్ని ప్రజలు కీర్తించారు. పేదలంతా సాయన్నను దైవంగా భావించారు. ఆయనను ఎంతో గౌరవించారు. పాలమూరు జిల్లాలోని అనేక గ్రామాల్లో సాయన్న నిర్వహించిన సాహసోపేత కార్యక్రమాలను పేద ప్రజలంతా కీర్తించారు.
మొహర్రం పండుగ రోజున జన్మించిన సాయన్న ప్రతీ ఏడాది ఆ రోజు కందూర్లు నిర్వహించి పేదోల్లందరికీ కడుపునిండా భోజనం పెట్టించేవాడు. పెత్తందా ర్ల దౌర్జన్యాలను ఎదిరించి ధైర్యంగా నిలబడిన రోజునే పేద ప్రజలు అన్ని విధాలుగా బాగు పడుతారని సాయన్న ఉద్ఘాటించాడు. సాయన్న పట్ల ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని, గౌరవాన్ని పెత్తందార్లు, పటేండ్లు, భూస్వాములు భరించలేక పోయారు. అలనాటి గోల్కొండ నిజాం నవాబుకు ఫిర్యాదు చేశారు. సాయన్నను, ఆయన దళాన్ని వెంటనే నిర్బంధించాలని నవాబు ఆదేశాలు జారీ చేశాడు.
సాయన్నను బంధించడానికి పోలీసులు, రహస్య గూఢాచారులు రంగంలోకి దిగారు. వాళ్లెవ్వరికీ దొరకకుండా సాయ న్న గ్రామగ్రామాన, ఇరుకు సందుల్లో, పూరి గుడిసెల్లో తిరుగుతూ ప్రజలను కలిసేవాడు. వారిలో ఎదు రించే ధైర్యాన్ని నింపేవాడు. తోటల్లో, పంట చేన్లల్లో, వాగుల్లో, వంపుల్లో, కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఇసుకబాటల్లో తిరుగుతూ సాయన్న తన ఉద్యమాన్ని నిర్వహించాడు. ఆనాటి పాలకులు ‘దండుగ’ల పేరిట, రకరకాల పన్నుల రూపంలో చేసిన దోపిడీలను అరికట్టడానికి సాయన్న ప్రయత్నించాడు.
ఇనుప గొలుసులతో బంధించారు!
భూస్వాములు, ధనవంతులు అంతా కలిసి సాయన్నను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు. చివరికి ఆయనను నిర్బంధించారు. ఇనుప గొలుసులతో బంధించారు. ఈ వార్త తెలుసుకున్న పద్నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేశారు. భూస్వాముల ఇళ్ల ముందు, పోలీసు స్టేషన్ల వద్ద నిరసనలు జరిపారు. అరుస్తూ, ఏడుస్తూ నినదించారు. నిజాం నిరంకుశ పాలనా కాలంలోనే ప్రజలంతా చైతన్యవంతులై సాయన్నను రక్షించుకోవటానికి అన్ని విధాల ప్రయత్నించారు.
ఇనుప గొలుసుల సంకెళ్లలో బంధించిన సాయన్న దగ్గరికి వెళ్లడానికి కూడా ఆనాటి పోలీసులు, సైనిక జవాన్లు సాహసించలేదు. అంతటి నిర్బంధంలోనూ సాయన్న “నా పిక్కలు చీరురా”, “రెక్కలు చీరురా”, “అప్పుడైతే పోతది నా ప్రాణం వెంకన్నా” అంటూ రౌద్రంగా అరిచినట్లు అలనాటి ప్రాచీన సాంస్కృతిక పాటల్లో నేటికీ వినిపిస్తుంది. 125 ఏళ్ల కిందట సాయన్న చేసిన వీరోచిత పోరాటగాథలు, పాటలు నేటికీ పాలమూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. నిజాం నిరంకుశ పాలనలో అమరుడైన తెనుగు సాయన్న సాహసోపేత జీవితం నుండి ముదిరాజ్ సామాజిక వర్గం స్ఫూర్తి పొందాల్సి ఉంది.
పల్లెబోయిన అశోక్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ముదిరాజ్ మహాసభ